హనుమకొండ/మహబూబాబాద్ రూరల్, జూలై 11 : సర్వర్ డౌన్ కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో హనుమకొండ, మహబూబాబాద్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జనాలు పడిగాపులు కాయాల్సి వచ్చింది. భూముల అమ్మకాలు, కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో అధికారులు స్పష్టంగా చెప్పక పోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉండి అవస్థలు పడ్డారు. రాష్ట్ర ప్రభు త్వం భూముల మార్కెట్ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించి ఆ దిశగా కసరత్తు చేస్తుండడం, తిథులు మం చివి కావడంతో పెద్ద సంఖ్య లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనాలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సర్వర్ డౌన్ కావడంతో వేచి ఉం డాల్సి వస్తున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స మస్య వస్తే వెంటనే స్పందించాల్సిన సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కాశీబుగ్గ : సర్వర్ సమస్యల కారణంతో పోచమ్మమైదాన్‌లోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. మ ధ్యాహ్నం నుంచి సర్వర్ డౌన్ అయి ఆధార్ లిం కులు కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో జిల్లాలోని వివిధ మండలాలల నుంచి వచ్చిన వారు సాయంత్రం వరకు వేచి చూసి నిరాశతో వెనుదిరిగిపోయారు. గురువారం 50కి పైగా రిజిస్ట్రేషన్లు నిలిచినట్లు తెలిసింది.
మేము కొన్న భూమిని గురువారం రిజిస్ట్రేషన్ చేసుకుందామని ముందే నిర్ణయించుకున్నాం. మాకు భూమిని అమ్మిన వారు మా పేరుపై రిజిస్ట్రేషన్ చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. సెలవు పెట్టి, చిన్న పిల్లలను వదిలిపెట్టి ఉదయమే రిజిస్ట్రేషన్ ఆఫీసుకు మేము, వాళ్లు చేరుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చే సరికి సర్వర్ డౌన్ అవడంతో రిజిస్ట్రేషన్లు కావడం లేదని తెల్సింది. రోజంతా సర్వర్ పని చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో అని ఎదురు చూపులతోనే ఇరువురి సమయం వృథా అయింది.
నా కొడుకు పేరున భూమి రిజిస్ట్రేషన్ చేద్దామని ఆఫీసుకు వత్తే అవుతలేవని తెల్సింది. దీంతో రోజంతా ఎదురు చూడాల్సి వచ్చింది. గిట్ల అయితే ఎట్లా.. మళ్లా రావాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకు కాళ్లు నొప్పులు ఉన్నాయి.. కట్టె పట్టుకొని నడుస్తున్నా. నాలాంటి వాళ్లకు ఇబ్బంది కదా.. ప్రభుత్వం ఇలా జరుకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
పొద్దున పది గంటలకు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వచ్చాం. టోకెన్ ఇచ్చి కొంతసేపు ఉండమని చెప్పారు. మధ్యాహ్నం అయి నా ఒక్క రిజిస్ట్రేషన్ కాలేదు. కారణం ఏంటో కూడా చెప్పడం లేదు. భోజనం చేయకుండా ఇక్కడే కూర్చున్నాం. సాయంత్రం ఆఫీస్‌లో సర్వన్డౌన్ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ కావడం లేదని, ఈ సమస్యకు పరిష్కారం మా చేతిలో లేదని అధికారులు ఆలస్యంగా చెప్పిండ్రు.