హనుమకొండ సబర్బన్, జూలై 2 : వర్షాకాలం ప్రారంభమై నెల పూర్తయింది. అయినా ఆశించిన వర్షాలు లేక సాగు భూములు బీళ్లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం కుదేలైంది. పొలాల్లో వరి నాట్లు, వొడ్లు చెక్కుడు, పత్తిలో కలుపు తీసుడు, గుంటుక తోలుడు వంటి పనులతో బిజీగా ఉండాల్సిన రైతులు వీసమెత్తు పనిలేక ఖాళీగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షం మెట్ట పంటలకు కొంత ఊపిరి పోసినట్లయింది.
హనుమకొండ జిల్లాలో ఈ సీజన్లో 86 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే నీటి సౌకర్యం ఉన్న రైతులు 12,300 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు నాటారు. వీటికి రెండు రోజులకోమారు తడులు పెడుతూ బతికించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మోస్తరు వర్షంతో పత్తిలో గుంటుకు తోలడం, కలుపు తీయడం లాంటి పను లు రైతులు చేపడుతున్నారు. జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా లోటు వర్షపాతం నమోదైంది. వానకాలం ప్రారంభమైన నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 147.9 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదు కావాల్సి ఉండగా ఇందులో కేవలం 46.1 మి.మీ. మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 69 శాతం లోటు ఉంది. జిల్లాలో ఎప్పుడు వర్షాలు కురిసినా ఏదో ఒక మండలంలో లేదా కొన్ని గ్రామాల్లోనే పడుతున్నాయి తప్ప అన్ని మండలాల్లో వానలు పడుతలేవు.
వరి సాగుపై నీలి నీడలు..
జిల్లాలో ప్రతి సీజన్లో వరి ప్రధాన పంటగా సాగవుతుంది. సుమారు లక్షా 45 వేల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేస్తుంటారు. ఈ సారి కూడా పెద్ద ఎత్తున నాట్లు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సన్నాలే వేస్తే ఈసారి తప్పకుండా బోనస్ ఇస్తామని ప్రభుత్వం వాగ్ధానం చేయడంతో ఆశతో రైతులు సన్న రకాలను సాగు చేసేందుకు రోహిణి కార్తెలోనె నార్లు పోశారు. పొలాలు దున్ని నాట్లు వేయాల్సిన తరుణంలో కనీసం దున్నుడు ప్రక్రియ కూడా చేపట్టకపోవడానికి వర్షాభావమే కారణమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా భారీ వర్షాలు కురవని పక్షంలో సాధారణ సాగులో నాలుగో వంతు కూడా నాట్లు పడే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలాల్లో వేసిన పచ్చి రొట్ట మొక్కలు కూడా పెరగడం లేదు. ఇక మక్కజొన్న సాగు మొదలే కాలేదు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5 వేల ఎకరాలు ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇందులో వెయ్యి ఎకరాలు పడితే మహా ఎక్కువ అన్నట్లుంది.
నారు పోసి నెల దాటింది
వర్షాలు పడుతాయనే ఆశతో రోహిణి కార్తెలోనే నారు పోసిన. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తుందని ప్రకటించడంతో సన్నాలను పోసిన. ఇప్పుడేమో వర్షాలు లేవు. పొలం దున్నుదామంటే బాయిల ఉన్న నీళ్లు దూగుత లేవు. నారు పెరిగి పోతోంది. వానలు పడి పంట గట్టెక్కుతుందనుకున్న. వాతావరణ పరిస్థితి చూస్తుంటే దినదినం ఆశలు సన్నగిల్లుతున్నయి. ఆలస్యంగా నాట్లు వేసే పరిస్థితి లేదు. ఎం చేయాలో నాకు అర్థం కావడం లేదు.
– బొమ్మినేని మహేందర్ రెడ్డి, రైతు, ఎల్కతుర్తి