కోల్కతా: భారత దిగ్గజ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు అతడి భార్య డోనాని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న తనకు గత ఆరు నెలలుగా ఈ బెదిరింపు లేఖలు వస్తున్నాయని ఠాకూర్పూర్ పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో గంగూలీ పేర్కొన్నాడు. ‘గంగూలీని చంపేస్తామంటూ ఆరు నెలలుగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి లేఖలు వస్తున్నాయి. ఇటీవల గంగూలీతో పాటు అతడి భార్యకూ ఇదే తరహా లెటర్ వచ్చింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిని మేం తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించాం. లేఖలను పరిశీలించిన అనంతరం వాటిని తీసుకొస్తున్న కొరియర్ వారితో మాట్లాడామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటాం’అని పోలీసులు తెలిపారు.