కాషాయపక్షానికి కంచుకోటలుగా భావించే ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ప్రధాని నరేంద్రమోదీకి జనాదరణ బాగా తగ్గిపోయింది. బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఇది నిరూపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యాక నితిన్ నబీన్ రాజీనామాతో ఈ ఉపఎన్నిక జరిగింది. బిహార్ రాజధాని పట్నాలో అంతర్భాగమైన బాంకీపూర్‌లో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ చేతిలో బీజేపీ అభ్యర్థి నీరజ్‌కుమార్ సిన్హా ఓటమి దేశవ్యాప్తంగా సంచలనమైంది.
1995 నుంచి బీజేపీ భారీ ఆధిక్యంతో గెలుస్తున్న ఈ స్థానంలో పీకే 19 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలువడం సంఘ్ పరివారానికి ఊహించని షాక్. హిందుత్వ రాజకీయాలకు కేంద్ర బిందువైన ప్రాంతంలో పరాజయం 2024 పార్లమెంటు ఎన్నికలతో మొదలైన బీజేపీ పతనం ఏ స్థాయికి చేరిందీ స్పష్టం చేస్తున్నది. బీజేపీకి పునాదిగా భావించే హిందూ అగ్రకులాల జనాభా గణనీయంగా ఉన్నచోటే అది కుదేలైంది. ఇది ఉత్తరాది జనం ఆలోచనలో వచ్చిన మార్పునకు సంకేతం.
1990 ఆరంభం నుంచి బీజేపీ ఎదుగుదలకు ఊతమిచ్చిన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామజన్మభూమిలో కాషాయ నేతల అవినీతి, భక్తుల విరాళాల దోపిడీ వంటి విషయాలు వెల్లడైన కొద్ది మాసాలకే దేశ రాజధాని ఢిల్లీలో జెన్-జీ ఉద్యమం విజయవంతమైంది. మోదీ సర్కార్ మెడలు వంచిన నవతరం గత పన్నెండేండ్లుగా స్తబ్దుగా ఉన్న భారత ప్రజలను మేల్కొల్పారు. గత యేడాది నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్‌యూ పొత్తుతో బీజేపీ భారీ విజయం సాధించింది. వరుసగా రెండోసారి జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు దానికి దక్కాయి. అప్పటినుంచి రాష్ట్రంలో కాషాయ నేతల దూకుడు మొదలైంది. నితీశ్ క్యాబినెట్లో సభ్యుడైన నితిన్ నబీన్‌ను ఆ తర్వాత నెలకే (కిందటి డిసెంబర్ 15) బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసింది మోదీఅమిత్ షా ద్వయం. మళ్లీ నెలకే.. అంటే ఈ ఏడాది జనవరి 20న అతనిని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
హిందీ రాష్ర్టాల్లో ఒక్క బిహార్‌లో మాత్రమే ముఖ్యమంత్రి పదవి అప్పటివరకూ రాలేదనే దిగులును నితిన్ నబీన్‌కు అధ్యక్ష పదవి లభించిన కొద్ది నెలలకే పోగొట్టుకున్నది బీజేపీ. అసెంబ్లీలో పెరిగిన బలంతో నితీశ్‌ను సీఎం గద్దె నుంచి దిగిపోయేలా చేసింది మోదీషా ద్వయం. ఈ ఏడాది ఏప్రిల్ 15న బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బిహార్ సీఎంగా గద్దెనెక్కారు.
దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాదిన వేగంగా బలపడడానికి కారణమైన అయోధ్య రామజన్మభూమి వివాదం కోర్టు తీర్పుతో బీజేపీకి అనుకూల అంశంగా మారినట్టు కనిపించింది. కిందటి లోక్‌సభ ఎన్నికల ముందు 2024 ఆరంభంలో అయోధ్యలో బాల రాముడి ఆలయ ఆవిష్కరణ జరిగింది. అయితే, పార్లమెంటు ఎన్నికల్లో పాలకపక్షం వరుసగా మూడోసారి సాధారణ మెజారిటీ సాధించే అవకాశం అప్పుడు కోల్పోయింది. మొత్తం 543 సీట్లున్న లోక్‌సభలో ఈ పార్టీ బలం 240కి పడిపోయింది. కనీస మెజారిటీకి 33 స్థానాలు తగ్గాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 సీట్లలో మెజారిటీ సీట్లు బీజేపీకి దక్కలేదు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకత్వంలోని కూటమి అత్యధిక సీట్లు (43) కైవసం చేసుకున్నది. అయోధ్య రాముడి గుడి ఉన్న ఫైజాబాద్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్ విజయం బీజేపీ ప్రతిష్ఠను చావుదెబ్బతీసింది. ఆ తర్వాత గత రెండేండ్లుగా సాగిన యూపీ పరిణామాలు రాష్ట్రంలో బీజేపీ బలహీనమవుతున్నదనే వాస్తవానికి దర్పణం పట్టాయి.
అయోధ్య చందాల గొడవ ముదురుతున్న తరుణంలోనే నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై జెన్-జీ ఆందోళనకు దిగడం మోదీ సర్కార్‌కు ఊహించని సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే నాయకత్వాన కాక్రోచ్ జనతా పార్టీ (సీకేపీ) పుట్టుకురావడంతో నీట్ లీకేజీ వ్యతిరేక విద్యార్థుల ఆందోళనకు బలం పెరిగింది. కేంద్ర విద్యామంత్రి, బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్‌లో సీకేపీ నేతృత్వంలో ఆందోళన ఉధృతమైంది. ఆ సమయంలోనే అదే డిమాండ్‌తో చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరశనకు దిగడంతో మోదీ సర్కార్ దిగివచ్చింది.
జెన్ జీ ఆందోళన తీవ్రం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించక తప్పలేదు. ఇలా దేశంలో ప్రధానంగా ఉత్తరాదిన బీజేపీ జనంలో పలుచనైంది. ఇక, వచ్చే ఏడాది ఫిబ్రవరిమార్చిలో ఉత్తరప్రదేశ్ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు బీజేపీ భవిష్యత్తును నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. వీటిలో ఒక్క పంజాబ్ మినహా మిగిలిన నాలుగుచోట్లా పాలకపక్షం బీజేపీయే. దేశంలోనే అతిపెద్దదైన యూపీలో 2017 నుంచీ బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కు పిడికిలితో రాజ్యమేలుతున్నది.
అవినీతి, నిరుద్యోగం ఫలితంగా అక్కడి ప్రజలు బీజేపీపై విశ్వాసం కోల్పోయారని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ రెండున్నరేండ్లలో యూపీలో కూలిపోతున్న ఎక్స్‌ప్రెస్‌వేలు, జనంపై జులుం పెరిగింది. వీటికి తోడు అయోధ్య రాముడి గుడి విరాళాలను సంఘ్ పరివార్ నేతలు దిగమింగారనే ఆరోపణలు పాలకపక్షాన్ని జనం దృష్టిలో కిందికి నెట్టివేశాయి. ఢిల్లీ జంతర్ మంతర్‌లో సీజేపీ, ఇతర విద్యార్థి సంఘాల నేతృత్వంలో ఆందోళన విజయవంతమయ్యాక యూపీ నవతరం కూడా పోరాటమార్గంలో పయనం ప్రారంభించింది.
కొన్నిచోట్ల ఉన్నత పాఠశాలల్లో సౌకర్యాలు సరిగా లేవని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నట్టు వార్తలొచ్చాయి. వారికంటే ముందే నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో యువత చేసిన ఆందోళన విజయం సాధించింది.
1977 ఆరంభంలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ దశాబ్దాల పరిపాలన ముగిసినట్టే మోదీ పాలన కూడా చివరి దశకు చేరుకున్నదని ఇటీవలి పరిణామాలు చెప్తున్నాయి. బీజేపీకి.. ముఖ్యంగా సంఘ్ పరివార్‌కు ఆయువుపట్టుగా పరిగణించే ఉత్తరాది హిందీ ప్రాంతాల్లో కాషాయపక్షం అధికారం కోల్పోయే దశకు చేరుకున్నదనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
నాంచారయ్య మెరుగుమాల