వరంగల్, జనవరి 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ దవాఖానలకు మందుల సరఫరా ప్రక్రియ గందరగోళంగా మారింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు చేరవేసే వ్యవస్థ గాడి తప్పింది. ఫలితంగా ప్రజలకు అవసరమైన మందులు సకాలంలో అందక ఇబ్బంది అవుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర మందుల కొరత ఉంటున్నది. పీహెచ్‌సీలకు అవసరమైన వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్ వంటి అత్యవసర మందులు అందడం లేదు. చిన్న పిల్లలకు ప్రతినెలా ఇచ్చే వ్యాక్సిన్లు పీహెచ్‌సీల్లో అం దుబాటులో ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే పీహెచ్సీ సిబ్బంది స్వయంగా సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు వెళ్లి మందులు తీసుకుపోవాల్సి వస్తున్నది. రెండు, మూడు రోజులకు ఒకసారి ఇలా డ్రగ్ స్టోర్‌కు వెళ్ల డం, అటు పీహెచ్సీలో సేవలందించడం.. ఇలా రెండు రకాల పనులతో పీహెచ్‌సీల్లో ఆశించిన మేరకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. పీహెచ్‌సీల్లో మందుల కొరత సమస్య రోజురోజుకూ తీవ్రమై రోగులకు శాపంగా మారుతున్నది.
సరఫరా వ్యవస్థ లేదు
గతంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తపాలా శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ దవాఖానాలకు అవసరం మేరకు ప్రభుత్వం నేరుగా మందులను సరఫరా చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఈ విధానాన్ని పక్కన పెట్టింది. కనీస వసతులు లేకుండా జిల్లాకు ఒక డ్రగ్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా పరిధిలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వ దవాఖానాలకు ఇండెంట్ ప్రకారం డ్రగ్ స్టోర్ నుంచి మందుల సరఫరా చేయాలని నిర్ణయించింది. కొత్తగా ప్రకటించిన జిల్లా డ్రగ్ స్టోర్లలో కనీస వసతులు లేవు.
ఇక్కడ మందులను నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు అందడం లేదు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మారుమూల ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు సకాలంలో మందులను రవాణా చేసిన తపాల శాఖ సేవలను ఏడాది నుంచి వినియోగించుకోవడం లేదు. దీని స్థానంలో వాహనాలను అద్దెకు తీసుకొని పీహెచ్‌సీలకు సరఫరా చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. అంతేగాక సరఫరా చేసిన వాహనాల బిల్లులను ప్రభుత్వం ఎంతకీ చెల్లించడం లేదు. సంవత్సర కాలం నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో డ్రగ్ స్టోర్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇండెంట్ పెట్టిన పీహెచ్‌సీల సిబ్బందిలో ఒకరు డ్రగ్ స్టోర్‌కు వచ్చి మందు లు తీసుకుపోవాలని చెబుతున్నారు. డ్రగ్ స్టోర్, పీహెచ్సీ సిబ్బంది మధ్య పేదలకు మందులు అందడం లేదు.
వసతుల కరువు
గతంలో ఉమ్మడి జిల్లాకేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తపాలా శాఖ సేవలతో ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి మందులు సరఫరా అయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. వీటిలో వసతులు కల్పించడంలో విఫలమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు డ్రగ్ స్టోర్లను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్లలో ఎలాంటి వసతులు కల్పించలేదు. జిల్లా పరిధిలో మందుల సరఫరా చేసేందుకు ఎలాంటి వాహనాలను సమకూర్చలేదు. డ్రగ్ స్టోర్‌లో అసరమైన మేరకు సిబ్బంది లేరు. జిల్లాలోని డ్రగ్ స్టోర్లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. డ్రగ్ స్టోర్‌కు మందులు వస్తే దింపి నిల్వ చేసేందుకు సిబ్బంది లేరు. డ్రగ్ స్టోర్స్ నిర్వహణ లేకపోవడం, మందులు సకాలంలో రాకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని 94 పీహెచ్‌సీలు, 17 అర్బన్ హెల్త్ సెంటర్లు, 6 బస్తీ దవాఖానలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న పేద రోగులు మందులు అందక ఇబ్బంది పడుతున్నారు.
కూలింగ్ వ్యవస్థ లేదు
కొత్తగా ఏర్పాటు చేసిన డ్రగ్ స్టోర్లలో మందులను నిల్వ చేసే వ్యవస్థ అధ్వానంగా ఉన్నది. మందులను నిల్వ చేసే ఉష్ణోగ్రత(కూలింగ్) నిర్వహణ లేదు. దీంతో మందు లు సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా 0 నుంచి 8 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచాల్సిన వ్యాక్సిన్లు జిల్లా డ్రగ్ స్టోర్లకు రావడం లేదు. ఏసీ వ్యవస్థలో నిల్వ చేయాల్సిన యాంటీబయాటిక్ మందులు ఉండడం లేదు. డ్రగ్ స్టోర్లలో నిల్వ సామర్థ్య వ్యవస్థ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది.