నాడు ఎండాకాలం వచ్చిందంటే చుక్క నీరు లేకుండా ఎండిపోయిన చెరువులు, నీళ్లందక బీడువారిన పంటపొలాలే కనిపించేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ ముందుచూపుతో చెరువులు పూర్వవైభవం సంతరించుకొని వ్యవసాయం పండుగలా మారింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత, గట్లను బలోపేతం చేయడం ద్వారా వర్షపునీరు, వరద నీరు చేరి నిల్వ ఉండడంతో మండువేసవిలోనూ నిండుకుండల్లా ఉంటున్నాయి. గతంలో ఒక్క పంటకే సరిపడా నీళ్లు లేని పరిస్థితి ఉండగా ఇప్పుడు రెండు పంటలు, కొన్ని చోట్ల మూడు పంటలు కూడా సంతోషంగా పండిస్తున్నారు.
హనుమకొండ జిల్లా దామెర మండలంలో 14 గ్రామాలున్నాయి. ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలను రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించింది. పూడిక, మరమ్మతులు పూర్తయిన తర్వాత ఊరుగొండ పెద్ద చెరువు, కోగిల్వాయి శనిగచెరువు, పులుకుర్తి రంగనాయకుల చెరువు, పసరగొండ మాటుచెరువు, ల్యాదెళ్లలో దామెరచెరువు, బొమ్మల చెరువు, జంగమయ్యకుంట, ఈరాయికుంట, ముస్త్యాలపల్లి, వెంకటాపురం, ముస్త్యాలపల్లి, దామెర చెరువులు కళకళలాడుతూ పూర్వవైభవం సంతరించుకున్నాయి.
అలాగే ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి విడుదల చేస్తున్న నీళ్లు కాల్వల ద్వారా చెరువుల్లోకి చేరుతుండడంతో ఏ చెరువును చూసినా పుష్కలమైన నీటితో నిండుగా కనిపిస్తోంది. ఫలితంగా మక్కజొన్న, కూరగాయల పంటలకు నీరు అందడంతో పాటు వరి సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. 2021-22 వానకాలంలో దామెర మండలంలో 3815 ఎకరాల్లో వరి సాగు చేయగా యాసంగిలో 2228 ఎకరాల్లో వేశారు. 2022-23 వానకాలంలో 3960 ఎకరాల్లో వరి సాగు చేయగా యాసంగిలో 4007 ఎకరాల్లో సాగు రైతులు చేస్తున్నారు.
చెరువులను మంచిగ చేసిన్రు
సీఎం కేసీఆర్ సార్ మిషన్ కాకతీయతో చెరువులను మంచిగ చేసిండు. పూడిక తీయడం వల్ల ఎండాకాలంలో కూడా పుష్కలంగా నీళ్లు ఉంటానయ్. వరి మంచిగ పండిస్తున్నం. వ్యవసాయ బావుల్లో కూడా నీళ్లు మస్తున్నయ్. పంటలు కూడా బాగా పండుతున్నయ్. చాలా సంతోషంగా ఉంది.
– సంగనబోయిన కిరణ్, కోగిల్వాయి
చెరువుల్లో పుష్కలంగా నీరు
చెరువుల్లో పుష్కలంగా నీరు ఉంది. యాసంగిలో కూడా పంటలు బాగా పండుతున్నయ్. నీటికి ఢోకాలేదు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక తీయడం వల్ల నీరు ఉంటున్నది. సీఎం కేసీఆర్ మంచి ఆలోచన చేసిండు. ఆయన వల్లనే మేం ప్రతి సంవత్సరం రెండు పంటలు తీస్తున్నం. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– పాకాల రంగారెడ్డి, కోగిల్వాయి
మిషన్ కాకతీయతో రెండు పంటలు
ఊరుగొండ పెద్ద చెరువులో పూడిక తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఆయకట్టు రైతులమంద రం రెండు పంటలు తీస్తున్నం. బోర్లు మంచిగ పోస్తున్నయ్. చెరువు కట్టలను గట్టిగ చేయడం వల్ల నీళ్లు మస్తున్నయ్. చెరువుల్లో నీరు ఉండేలా చేసిన సీఎం కేసీఆర్ సార్‌కు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రైతులమంతా రుణపడి ఉన్నం.
– కునాటి సునీల్‌రెడ్డి, ఊరుగొండ