హనుమకొండ, జులై 6: ‘కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసు.. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరుతాం.. దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదు. దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. మహారాష్ట్ర , గుజరాత్లో ఎలా ఏర్పాటు చేస్తున్నది..? ఈ ప్రశ్నకు తెలంగాణ బీజేపీ నేతలు కూడా సూటిగా సమాధానం చెప్పాలి.’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని తప్పుదోవ పట్టించి, కేవలం పీవోహెచ్ వర్షాపు.. ఆ తర్వాత వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అని.. కాజీపేటకు వస్తున్న ప్రధాని మోడీ మోసాన్ని ఓరుగల్లు ప్రజలు గమనిస్తున్నారు. తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు’ అని స్పష్టం చేశారు. ఈ నెల 8న కాజీపేటకు ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియా నుంచి ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాలుగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ వస్తే తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల నోట్లో కేంద్ర ప్రభుత్వాలు మట్టికొడుతూనే ఉన్నాయన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 2016 పార్లమెంట్ సమావేశాల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీస్తే.. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని, అంత అవసరం కూడా లేదని కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు. ఆ తర్వాత పీయుష్ గోయల్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రలోని లాథూర్‌లో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మొన్న జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ అకడ రూ. 20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని చెప్పిన కేంద్రమే ఆ తర్వాత రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోందంటే తెలంగాణ ప్రజలను మోడీ ఎలా మోసం చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.
తెలంగాణపై మోడీ చూపిస్తున్న వివక్షకు ఇది నిదర్శనమని, తెలంగాణ బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతుంటే కేవలం పీవోహెచ్ వర్షాపు ఎందుకని ప్రశ్నించామని, దాంతో కేంద్రం ఆలోచనలో పడి కాజీపేటలో పీవోహెచ్ కాదు వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. దీనిని స్వాగతిస్తున్నామని పేర్కొంటూనే కాజీపేటకు కావాల్సింది కోచ్ ఫ్యాక్టరీ మాత్రమేనని, కోచ్ ఫ్యాక్టరీతోనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వేలాదిమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే కోచ్‌ఫ్యాక్టరీ అంశాన్ని బీజేపీ సర్కారు గుర్తించాలని, లేకుంటే తెలంగాణ ప్రజల చేతిలో బీజేపీకి చావుదెబ్బ తప్పదని ప్రకటనలో హెచ్చరించారు. కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని, అందులో బీఆర్ఎస్ పాత్ర అత్యంత కీలకం కాబోతున్నదని పేర్కొన్నారు. అప్పుడు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించి తీరుతామని, కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసునని స్పష్టం చేశారు.