వరంగల్ : రాష్ట్రం ప్రభుత్వం వృద్ధులకు రెండు వేల ఆసరా పెన్షన్ ఇస్తూ వారికి అండగా ఉంటున్నది. అయితే పింఛన్ డబ్బుతో ఓ వ్యక్తి స్కూటీ కొనుగోలు చేసి దూర భారాన్ని తగ్గించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..దుగ్గొండి మండలం శివాజీనగర్ గ్రామానికి చెందిన వృద్ధుడు రాజేశ్వరరావు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పరితపించాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపునందుకుని ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం రాజేశ్వరరావుకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసింది. ఆయన ప్రతి నెల వృద్ధాప్య పింఛన్ రూ. 2016 తీసుకుంటున్నాడు.
పెన్షన్ డబ్బును ఇతర అవసరాలకు ఖర్చు పెట్టకుండా ద్విచక్ర వాహనం కొనుక్కోవాలని రూ. 48,500 పోగు చేశాడు. ఈ డబ్బుతో స్కూటీ కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడు. ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, వృద్ధాప్య పింఛన్ పొందుతున్నానని రాజేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. దూరం నడవలేకపోతున్న నేను పింఛన్ డబ్బుతో స్కూటీ కొనుక్కోవడం ఆనందంగా ఉందని మురిసిపోయాడు.