MLC Sirikonda Madhusudanachari | హనుమకొండ, జూన్ 28:దేశం దశ, దిశ మార్చిన నేత పీవీ నరసింహారావు అని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం పీవీ నరసింహారావు 104వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పీవీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే నొడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హనుమకొండ బస్టాండ్ జేఎన్ఎస్ స్టేడియంలోని విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మధుసూదనా చారి మాట్లాడుతూ తెలంగాణ మారుమూల పల్లె నుంచి వచ్చిన పీవీ దేశ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. బహుభాషా కోవిదుడని తెలిపారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఆర్థికవేత్త పీవీ అని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను అలంకరించి పార్టీకి వన్నె తెచ్చిన గొప్ప నాయకుడైన పీవీని కాంగ్రెస్ విస్మరించడం శోచనీయం అన్నారు. దేశాన్ని ఆర్థికంగా శక్తివంతంగా ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు పీవీ నరసింహారావు అని మాజీ శాసనసభ్యులు నొడితల సతీష్ కుమార్ అన్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టే స్థితి నుంచి భారత దేశాన్ని మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యేలా, ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా చేసిన నాయకుడు పీవీ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలన అధికారికంగా నిర్వహించి వారికి సముచిత గౌరవం ఇచ్చిందని అన్నారు.
తెలంగాణ, తెలుగు బిడ్డగా పీవీ మనందరికీ గర్వకారణమని తెలిపారు. వంగరలో నిర్మిస్తున్న పీవీ స్మారకాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. పీవీ జయంతి వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని అన్నారు. దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ అని, ఆయనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ సముచిత గౌరవం కల్పించారని అన్నారు. పీవీ శతజయంతిని సైతం అధికారికంగా ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు.
భారత దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న సైతం పొందారని, దేశ ప్రధానిగా సేవ చేశారని, ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన గొప్ప ఆర్థికవేత్తని కొనియాడారు. గొప్ప పాలన దక్షుడు పీవీ నరసింహారావు అన్నారు. తెలంగాణ బిడ్డ, తెలుగువాడు దేశ ప్రధానిగా సేవలు అందించడం తెలుగు వారందరికీ, తెలంగాణ ప్రజలందరికి గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ర్ట నాయకులు ముద్దసాని సహోదర్ రెడ్డి, కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, నాయకులు జనార్దన్ గౌడ్, నాయీముద్దీన్, సల్వాజి రవీందర్ రావు, పున్నం చందర్, దశరథం, విజయ్ కుమార్, కిరణ్, రాకేష్ యాదవ్, శ్యాం కుమార్, సౌరం రఘు, సదాంత్, జే కే, వీరాస్వామి, స్నేహిత్, ఇమ్మడి రాజు, శ్రవణ్, నరేంద్ర, అనిల్, సృజన్, బచ్చు అనిల్ కుమార్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.