నర్సింహులపేట, ఫిబ్రవరి 9 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఆ పార్టీ నేతల నిరసనలు, దూషణల నడుమ కొనసాగుతున్నది. గురువారం మరిపెడ మండలం ఆర్లగడ్డ తండాలో జరిగిన యాత్రలో రేవంత్‌రెడ్డి సాక్షిగా వర్గపోరు బయటపడింది. ఇద్దరు ఇన్చార్జిలతో డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడలో రెండు పార్టీ మండల కార్యాలయాలు ఏర్పాటుకావడం, మండల అధ్యక్షులుగా ఇద్దరు కొనసాగడం పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి కారణమైంది.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ రాంచంద్రూనాయక్ తానే డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి అని చెప్పుకొంటుండగా, కురవి మండలానికి చెందిన మాలోత్ నెహ్రూనాయక్ పార్టీ అధిష్ఠానం తనకే బాధ్యతలు అప్పగించిందని బల ప్రదర్శన చేపట్టారు. దీంతో కార్యకర్తలు ఎవరివైపు ఉండాలో తెలియక తలలు పట్టుకున్నారు. పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇరువర్గాలు చించేస్తూ, తొలగించారు. డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్థానికులే ముద్దు… స్థానికేతరులు వద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. యాత్రలో పార్టీ ముఖ్య నేతల ఎదుటే నెహ్రూనాయక్, జాటోత్ రామచంద్రూనాయక్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటూ బాహాబాహీకి దిగారు.
ఒకరినొకరు దూషించుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న ప్రజలు, కార్యకర్తలు భయాందోళనకు గురయ్యారు. అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరిపెడ మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం గోడ వద్ద విద్యార్థులు నిల్చొని ఉండగా, ఒక్కసారిగా గోడ దూకి లోనికి ప్రవేశించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కిపడ్డారు. టీ పీసీసీ అధ్యక్షుడై ఉండి ఇలా గోడ దూకడమేంటని అసహ్యించుకున్నారు. కాగా, సాయంత్రం మరిపెడ మండల కేంద్రంలో జరిగిన సభలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తుండగా కార్యకర్తలు, ప్రజలు విసుగు చెందారు. ప్రసంగానికి అడుగడుగునా అడ్డు చెప్పడంతో చేసేదేమీ లేక స్టేజీ దిగిపోయాడు.
మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 9 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్నది పాదయాత్రా.. లేక వాహనయాత్రో చెప్పాలని మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన వెంట కనీసం వెయ్యి మంది జనాలు కూడా లేరని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం పట్టణంలోని నెహ్రూసెంటర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలు తెలుకుని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై ఆరోపణలు చేయడం రేవంత్‌రెడ్డికి తగదన్నారు. చెడు ప్రచారం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రియాంక, నాయిని రంజిత్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, పట్టణ యువజన నాయకుడు మురళీధర్ రెడ్డి, నాయకులు తేళ్ల శ్రీను, మందుల రఘు, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం, ఫిబ్రవరి 9: బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నాడని కేసముద్రం మండల అధ్యక్షుడు మహ్మద్ నజీర్ అహ్మద్ అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో బీఆర్ఎస్, శంకర్‌నాయక్‌పై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో ధర్నా, అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మహ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పనిచేస్తుండడంతో ప్రజల్లో తమ ఉనికి కోల్పోతామనే భయంతో కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ దామరకొండ ప్రవీణ్‌కుమార్, మోడెం రవీందర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, కముటం శ్రీనివాస్, చిలువేరు సమ్మయ్యగౌడ్, సట్ల వెంకన్న, ఆగె వెంకన్న, గుగులోత్ వీరూనాయక్, ఎన్నమల ప్రభాకర్, రేణుకుంట్ల సుధాకర్, వెంకన్న, సాయి, మహేందర్, బోడ రాజేందర్ పాల్గొన్నారు.