వరంగల్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎగువన మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో నదిలోకి ఎవరూ దిగకూడదని, చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ నదిలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి(ఎన్‌హెచ్-163)పై ఉన్న వాజేడు మండలం టేకులగూడెం వంతెనను మూసివేశారు. తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో ఉన్న ఈ టేకులగూడెం వంతెనపై నుంచి గోదావరి ప్రవహిస్తుండటంతో వరద ఉధృతి తగ్గేదాకా వంతెనను మూసివేస్తున్నట్టు ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ తెలిపారు.
అత్యవసరంగా వెళ్లదలచుకున్నవారు కాళేశ్వరం వంతెన మీది నుంచి వెళ్లాలని సూచించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో పుష్కరఘాట్‌ను తాకి గోదావరి ప్రవహిస్తున్నది. గోదావరికి మేడిగడ్డ వద్ద శుక్రవారం ఉదయం 8,19,500 క్యూసెక్కులు ఉన్న వరద సాయంత్రానికి 8,68,850 క్యూసెక్కులకు చేరింది. అయితే, వచ్చిననీరు వచ్చినట్టే బరాజ్‌కు ఉన్న మొత్తం 85 గేట్లను ఎత్తి విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం బరాజ్(సమ్మక్క బరాజ్) నీటిమట్టం 82.05 మీటర్లకు చేరింది.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 14.82మీటర్లు మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో (14.34 మీటర్ల) గోదావరి ప్రవహిస్తున్నది. ఇక తుపాకులగూడెం వద్ద 7,26,510 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా బరాజ్‌కు ఉన్న మొత్తం 59 గేట్లను ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు. మరోవైపు దేవాదుల ప్రాజెక్టులో భాగంగా మూడు మోటార్లు ఆన్‌చేసి 831క్యూసెక్కుల నీటిని పంప్ చేశారు.