జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవులను కాపాడడం అటవీశాఖ అధికారులకు కత్తిమీద సాము లా మారుతున్నది. రిక్రూట్మెంట్ లేకపోవడం.. అరకొర సిబ్బందితో ఫీల్డ్ మీదికి వెళ్లడం గగనమవుతున్నది. అడవుల్లో స్మగ్లర్లు, పోడుదారును ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటున్నది. రోజురోజుకూ కలప (నాన్టే కు) స్మగ్లింగ్, పోడు దందా పెరుగుతున్నది. మరోవైపు రిజర్వు ఫారెస్టు నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. 200 మంది బీట్ అఫీసర్లకు 87 మందే ఉండ గా, అందులో 60 మందే విధులు నిర్వర్తిస్తుండడంతో వారిపై తీవ్ర పనిభారం పడుతున్నది. విధులు నిర్వహించడం ఇష్టం లేక ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ వెళ్లిపోతుండడంతో అడవుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది.
– జయశంకర్ భూపాలపల్లి, జూలై 31 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. అంటే 75 శాతం అడవులే ఉన్నా యి. భూపాలపల్లి అటవీ డివిజన్లో ఆజంనగర్, భూపాలపల్లి, చెల్పూర్, దూదేకులపల్లి, కొయ్యూర్, ఎస్ఎఫ్ భూపాలపల్లి, మహదేవపూర్ డివిజన్లో మహదేవపూర్, కాటారం, పలిమెల, పెగడపల్లి రేంజ్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 200 బీట్లు ఉండగా, 87 మంది బీట్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. 113 బీట్ ఆఫీసర్ల వేకెన్సీ ఉంది.
87 మందిలో 60 మంది బీట్ ఆఫీసర్లు మాత్రమే విధుల్లో ఉంటారు. ఒక్కో బీట్ ఆఫీసర్ 1500 నుంచి 2 వేల ఎకరాల అటవీ విస్తీర్ణంలో విధులు నిర్వర్తిస్తారు. ఈక్రమంలో ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు బీట్లు, అనగా సుమారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాల్లో అడవులను రక్షించాల్సి ఉంది. పనిభారంతో వీరు ఈ ఉద్యోగం వద్దంటూ వెళ్లిపోతున్నారు. సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్ అధికారులు పూర్తిస్థాయిలో ఉన్నారు. భూపాలపల్లి డివిజన్లోని 106 బీట్లలో 48 మంది, మహదేవపూర్‌లోని 94 బీట్లలో 39 మంది ఆఫీసర్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
సరిహద్దు సమస్యే అధికం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర జిల్లాల అడవులను కలుపుకుని ఉండడంతో కలప అక్రమ రవాణా అధికంగా ఉంటుంది. జిల్లాలో టేకు కలప అంతరించిపోగా ఇతర విలువైన కలప రవాణా జోరుగా సాగుతుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి గోదావరి దాటి మహదేవపూర్, పలిమెల సరిహద్దు గోదావరితీర ప్రాంతాలకు చేరుతున్నాయి. అయితే గోదావరి దాటిన కలప ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు రవాణా జరుగకపోయినప్పటికీ అక్కడే ఫర్నిచర్ చేయించుకుంటూ తరలిస్తున్నట్లు సమాచారం.
సిబ్బంది కొరతతో గోదావరి తీర ప్రాంతాల్లో తనిఖీలు, కలప సీజ్ చేయలేకపోతున్నామని అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గోదావరి పరిసర అడవుల నుంచి ఇసుక రవాణా సైతం జోరుగా సాగుతున్నా అడ్డుకునేవారు కరువవుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా రెండేళ్ల క్రితం వరకు ఆగిన పోడు మళ్లీ ఊపందుకుంది. జిల్లా, భూపాలపల్లి మండల సరిహద్దుల్లో అటవీ పోడు పెరిగిపోతున్నది. ఇటు కాటారం, మహాముత్తారం మండలం సరిహద్దులతో పాటు పస్రా, తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో పోడు యథేచ్ఛగా సాగుతున్నా అటవీ శాఖ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. ఇటీవలి కాలంలో ఈ దందా ఎక్కువైనా సిబ్బంది లేక అరికట్టలేకపోతున్నామని అటవీశాఖ అధికారులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అడవులను రక్షించేదెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొరత నిజమే
జిల్లాలో బీట్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉంది. పైస్థాయిలో జరిగే ప్రతి మీటింగ్‌లోనూ ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నాం. ఒక్కో బీట్ ఆఫీసర్ మూడు నుంచి నాలుగు బీట్లు చూస్తున్నా రు. సెక్షన్ ఆఫీసర్లు, డీఆర్వోలు, బీట్ ఆఫీసర్లతో కలప స్మగ్లింగ్, పోడును అరికడుతున్నాం.
– నవీన్‌రెడ్డి. డీఎఫ్‌వో
పోషకాల పుట్ట గొడుగులు
ఇవి అడవిలో సహజ సిద్ధంగా పెరిగే పుట్ట గొడుగులు. చెట్ల మొదళ్లలో ఏర్పడే పుట్టలపై ఇవి పెరుగుతాయి. వీటి రుచి అద్భుతంగా ఉండడంతో పాటు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో మార్కెట్లో వీటికి గిరాకీ అధికంగానే ఉంటుంది. గతేడాది కట్ట ధర రూ. 100 ఉండగా, ప్రస్తుతం రూ. 200 లభిస్తున్నది. దీని రుచి తెలిసిన వారు ధర ఎంతైనా కొనుగోలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజ లు, యువకులు పుట్ట గొడుగులను సేకరించేందుకు ఉదయమే అడవికి వెళ్తున్నారు. వీటిని విక్రయిస్తే గిట్టుబాటు అవుతుండడంతో ప్రస్తుతం దీనినే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు.
– మహదేవపూర్, జూలై 31