వాజేడు/కన్నాయిగూడెం/మహదేవపూర్(కాళేశ్వరం), సెప్టెంబర్ 27 : గోదావరి నదికి వరదలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ములుగు జిల్లా వాజేడులో మధ్యాహ్నం ఒంటి గంటవరకు గోదావరి 14.920 మీటర్లకు తగ్గినట్టే తగ్గి సాయంత్రం 6 గంటలకు 15.180 మీటర్లకు పెరిగింది. దీంతో మిర్చి పంటలు నీటమునిగాయి. పేరూరు శివారులోని మర్రిమాగువాగు బ్రిడ్జిపై వరదనీరు తొలగడంతో చండ్రుపట్ల-పేరూరు గ్రామాలకు రాకపోకలు కొనసాగాయి.
టేకులగూడెం శివారులోని రేగుమాగువాగు బ్రిడ్జి వద్ద ఉన్న 163 నంబర్ జాతీయ రహదారిపై ఉదయం వరద తొలగడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌కు రెండు రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు కొనసాగుతున్నాయి. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి వరద పెరిగి ముళ్లకట్ట పుష్కరఘాట్‌ను అనుకుని ప్రవహిస్తున్నది.
మరోవైపు కన్నాయిగూడెం మండలం తూపాకులగూడెంలోని సమ్మక్క బరాజ్ వద్ద గోదావరికి ఎగువ నుంచి 6,54,550 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 59 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ గోదావరి నీటిమట్టం 81.55 మీటర్లుగా ఉంది.
మేడిగడ్డ బరాజ్‌కు తగ్గిన వరద
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బరాజ్‌కు గోదావరి ప్రవాహం తగ్గుతోంది. శుక్రవారం ఇన్‌ఫ్లో 8,35,800 క్యూసెక్కులు రాగా, శనివారం 5,79,860 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వరద ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్రమట్టానికి 94.70 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి నది ప్రవాహం ప్రస్తుతం 8.9 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు.