‘40 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతూ ప్రజల మధ్య ఉంటున్న నాకు టికెట్ ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్లు, యూనివర్సిటీ భూములు, స్థానిక ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న దొంగ, పదవి పేరుతో దోచుకుంటున్న నాయి రాజేందర్‌రెడ్డికి పశ్చిమ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ అధిష్టానం నన్ను మోసం చేసింది. పార్టీలో ఉండి ద్రోహం చేసే వాళ్లకు టికెట్ ఇవ్వవద్దు. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించి నాకు టికెట్ ఇవ్వాలి. లేకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’నని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అధిష్టానానికి అల్టిమేటం జారీచేశారు. హనుమకొండలో బుధవారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో ఉంటూ మోసం చేసేవారి కోసమే నేను బరిలో ఉంటున్నట్లు స్పష్టం చేశారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 1 : 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, ఎన్నో కేసులున్నా ఎదుర్కొంటూ నిత్యం ప్రజల మధ్య ఉంటే ఉన్న తనకు కాకుండా అమ్ముడుపోయే ఒక దొంగకు, దోచుకొనేవారికి పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి మోసం చేసిందని, ఇప్పటికైనా పునరాలోచించి టికెట్ ఇవ్వాలని లేకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి స్పష్టంచేశారు. ఈమేరకు బుధవారం హనుమకొండలోని జక్రియ ఫంక్షన్ హాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా మాట్లాడుతూ పదవి పేరుతో పందికొకులాగా దోచుకుంటూ టికెట్లు, ఇందిరమ్మ ఇళ్లు, యూనివర్సిటీ భూములు అమ్ముకున్న నాయిని రాజేందర్‌రెడ్డికి అధిష్టానం టికెట్ ఇవ్వడమేమిటని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నవారికి కాదని ఇతర పార్టీల నుంచి వారికి టికెట్లు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ద్రోహం చేసేవారికి టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. నాయినికి టికెట్ ఇచ్చి యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలను వృథా చేశారన్నారు. గెలిచేవారికి టికెట్ ఇవ్వాలని పార్టీలో ఉండి మోసం చేసేవారికి ఇవ్వవద్దని హెచ్చరించారు. అధిష్టానం తనకు కచ్చితంగా టికెట్ ఇస్తుందని నమ్మకం ఉందన్నారు. లేకపోతే సింహం గురు ్తమీద ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని అధిష్టానానికి అల్టిమేటం జారీచేశారు. సమావేశంలో కార్పొరేటర్లు రజాలీ, జక్కుల రవీందర్‌యాదవ్, మాజీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాసరావు, యూత్ నాయకులు రేపల్లె రంగనాథ్, గణేశ్ పాల్గొన్నారు.
పరకాల, నవంబర్ 1 : అభ్యర్థుల ప్రకటన తర్వాత పరకాల కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. ఇందుకు పరకాల పట్టణ కేంద్రంలో బుధవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశమే నిదర్శనంగా నిలిచింది. పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్‌లో కాంగ్రెస్ నియోజకర్గ స్థాయి ముఖ్య నాయకుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఇది కాంగ్రెస్ నియోజవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. కానీ ఆయన గైర్హాజరు కావడంతో నాయకుల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. పరకాల టికెట్ కోసం మొదట ఇనగాల వెంకట్రామ్రెడ్డి, కొండా మురళీధర్ మధ్య వివాదం నెలకొంది. పలుమార్లు కొండా, ఇనగాల వర్గీయులు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఇటీవల ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇనగాల, కొండా నేరుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని తొడలు కొట్టుకోవడంతో పాటు, మీసాలు తిప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం పరకాల అభ్యర్థిగా ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్ కేటాయించింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అధిష్టానం బుజ్జగించడంతో శాంతించారు. ఈ విషయమై పరకాల నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసేందుకు ఇనగాలను ఇన్చార్జిగా నియమించారు. కానీ పరకాలలో సమావేశానికి ఇనగాల రాకపోవడంతో కొత్తగా వచ్చిన నాయకులతోనే ముగిసింది. ఇనగాల రాకపోవడం, మండల స్థాయి నాయకులు, తెలుగు రాని ఇతర రాష్ర్టాల నాయకులతో సభను మమ అనిపించడంపై పార్టీ శ్రేణులు బహిరంగంగానే అసంతృప్తిని వెల్లడించారు.