గీసుగొండ, ఫిబ్రవరి 26 : కాంగ్రెస్‌లో వర్గపోరు చివరికి దేవుడి పనులకూ తాకింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖా మురళీధర్‌రావు అనుచరుల మధ్య ఆధిపత్య పోరు గీసుగొండ మండలంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పనులకు ఆటంకం కలిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీరి మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమంటున్నది. గీసుగొండ మంత్రి కొండా సురేఖామురళీధర్రావు సొంత మండలం కావడంతో ఇక్కడ తమ పెత్తనమే సాగాలని వారు పట్టుబడుతుండగా, నా నియోజకవర్గంలో వారి పెత్తనమేంటి? నేను చెప్పిందే వినాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి పట్టుదలతో ఉండడంతో అధికారులు, పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ఎవరి మాట వినాలో తెలియక నలిగిపోతున్నారు.
ఒకే పార్టీలో రెండు వర్గాలుగా వీడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, గొడవలు దిగడం, దాడులు చేసుకోవడంతో ఈ వ్యవహారం గతంలో పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు కొమ్మాల జాతరతో వీరి మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర అభివృద్ధి పనుల విషయంలో వారి అనుయాయులు గొడవపడుతుండడంతో అధికారులు, భక్తులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 3న జాతర ప్రారంభమై నాలుగు రోజులపాటు వైభవంగా సాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రాజకీయ ప్రభలు పెద్దసంఖ్యలో తరలివస్తాయి. జాతరకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించేలా ఈ నెల 20 న ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ ,పంచాయతీ రాజ్, హెల్త్, విద్యుత్, ఇంజనీరింగ్, దేవాదాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గుట్టచుట్టూ భక్తిబండ్లు, ప్రైవేటు వాహనాలు, రాజకీయ ప్రభలు ప్రదక్షిణలు చేసేలా రోడ్డు లేక భక్తులు ఇబ్బందిపడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన రోడ్డు ఇప్పడే కాదని, మట్టి రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రెవెన్యూ, పోలీస్ అధికారులు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే హామీతో అధికారులు కొమ్మాల శివారులోని మట్టిని తరలించి రోడ్డు నిర్మిస్తుండగా, మంత్రి సురేఖ వర్గానికి చెందిన సూర్యతండా సర్పంచ్ రాఘవేంద్రతోపాటు కొందరు మంత్రి అనుచరులు, స్థానికులు మట్టి తరలింపును అడ్డుకున్నారు.
రోడ్డు నిర్మాణం పేరుతో మట్టిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని మంత్రి అనుచరులు, మట్టి తరలింపుదారులకు మధ్య గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న గీసుగొండ సీఐ మట్టి తరలింపుదారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, పోలీసుల సహకారంతో మట్టి తవ్వకాలు చేస్తున్నారని మంత్రి అనుచరులు ఆరోపించడంతో తమకు సంబంధం లేని విషయంలోకి తమను లాగుతున్నారని ఆగ్రహించి పోలీసులు మంత్రి అనుచరులను కూడా స్టేషన్‌కు తరలించారు.
తమనే స్టేషన్‌కు తరలిస్తారా.. అంటూ మంత్రి వర్గీయులు, ఎమ్మెల్యే వర్గీయులు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా పోలీసు, రెవెన్యూ అధికారులపై కూడా ఆరోపణలు చేశారు. దీంతో అధికారులు ఇదెక్కడి లొల్లి అంటూ తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌లో వర్గపోరుతో అటు అధికారులు, ఇటు పోలీసులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వర్గపోరులో భాగంగానే ఆలయ ఈవోను సైతం జాతర సమయంలో బదిలీ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. కాగా, మట్టి తవ్వకాలపై మంత్రి వర్గీయులు కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేశారు.
ఆలయ అభివృద్ధికి మంత్రి వర్గీయుడు సూర్యతండా సర్పంచ్ రాఘవేంద్రతోపాటు మరికొంత మంది సహకరించడం లేదని ఎమ్మెల్యే వర్గీయులు వాంకుడోత్ గోపాల్, నందనాయక్‌తండా సర్పంచ్ భూక్యా వీరేందర్ ఆరోపించారు. గురువారం వారు కొమ్మాల స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రోడ్డు నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ను డబ్బులు ఇవ్వాలని సర్పంచ్ బెదిరించాడని, ఇవ్వకపోవడంతో అధికారులు ,పోలీసులపై ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. సూర్యతండా పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేయలేదని, కావాలనే తమపై ఆరోపణలె చేయడం సిగ్గుచేటన్నారు. ఆలయ అభివృద్ధికి తమతో కలిసి రావాలని, లేకపోతే ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్, సుధాకర్, సమ్మయ్య, వీరన్న పాల్గొన్నారు.