పరకాల, డిసెంబర్ 21: కాంగ్రెస్ ప్రభు త్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా పెడుతున్న కేసులకు భయపడేది లేదని, హామీ ల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 650 మంది మహిళలకు పరకాల పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నా రు.
పరకాల నియోజకవర్గానికి కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును మంజూరు చేయగా.. అప్పటి మంత్రి కేటీఆర్ కృషితో అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయన్నారు. వాటిలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగు వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చామన్నారు. అందులో మొద టి విడతగా 650 మందికి కుట్టు మిషన్లు అందించామని, రానున్న రోజుల్లో మిగిలిన వారికీ అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు.
హామీల అమలు కోసం కేటీఆర్‌తో సహా ప్రతి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతామని పోచంపల్లి అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పదవిలో ఉన్నా.. లేకున్నా ప్రజల కోసమే పని చేస్తామన్నారు. గడిచిన ఏడాది కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకే శంకుస్థాపనలు చేస్తూన్నారని, అప్పుడు పూర్తయిన పనులను ప్రారంభిస్తున్నారన్నారు. పాలనను పక్కన పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఏడాదిలోనే రాష్ట్రం ఐదేండ్లు వెనక్కి వెళ్లిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నేతాని శ్రీనివాస్‌రెడ్డి, బండి సారంగపాణి, నల్లెల్ల లింగమూర్తి, రేగూరి విజయపాల్‌రెడ్డి, జాకీర్ అలీ, కుమారస్వామి, దామెర మొగిలి, గందె వెంకటేశ్వర్లు, ముదాలపల్లి అశోక్, మధుసూదన్ రెడ్డి, పరకాల, నడికూడ, దామెర మండలాల లబ్ధిదారులు పాల్గొన్నారు.