బయ్యారం, జనవరి 9 : ‘కాంగ్రెస్ అంటే ఇంతేనా..’ అని అనుకొనేలా ఆ పార్టీలో మరోసారి వర్గపోరు వీధికెక్కింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు గురువారం బయ్యారం మండలంలోని పార్టీ కార్యాలయం వేదికగా బట్టబయలైంది. ‘నువ్వెంత.. అంటే నువ్వెంద’ అంటూ రెండు వర్గాలు చేసిన రచ్చ మండలంలో చర్చనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు ముసలయ్య, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభమవుతున్న సమయంలో మరో వర్గానికి చెందిన నాయకులు వచ్చారు. తాము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులమేనని, తమకు సమాచారం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. దీంతోపట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి కలిగించుకొని పార్టీని నమ్ముకున్న ఉన్న వారు కాకుండా పార్టీకి సంబంధంలేని కొందరు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించాడు. దీంతో మరోవర్గం నాయకులు సైతం పార్టీ కోసం తాము కష్టపడ్డామని, ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేశామని ఎదురుదాడికి దిగారు. పార్ట్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా అనేక ఇబ్బందులు పడుతూ పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నామని పాత కాంగ్రెస్ నాయకులు వాపోగా, ఎన్నికల్లో గెలుపు కోసం తాము కూడా తీవ్రంగా కృషి చేశామని ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నాయకులు వారితో వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది.
తీవ్ర పదజాలంతో వాగ్వాదం చేసుకున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. నువ్వెంత.. అంటే నువ్వెంత.. అంటూ ఘర్షణ పడ్డారు. ఒకరిపైకి మరొకరు కుర్చీలు, బల్లలు విసురుకున్నారు. సుమారు గంటపాటు కార్యాలయంలో రచ్చరచ్చ చేశారు. ఓ వర్గం నాయకులు ఎమ్మెల్యే కనకయ్య.. భరత్‌చంద్రారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని.. నినాదాలు చేయగా.. మరోవర్గం ఎమ్మెల్యే కనకయ్య, జిల్లా అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి, మంత్రి పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి అని పోటీపడి నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పోలీసుల ఎదుటే వాగ్వాదం చేసుకున్నారు. ఎస్సై ఉపేందర్ ఇరువర్గాలకు సర్దిచెప్పి కార్యాలయం నుంచి వారిని బయటికి పంపి గేట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు సీనియర్ నాయకులు వివాదాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్‌లో వర్గపోరు బయ్యారం మండలంలో చర్చనీయంగా మారింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే నాయకులు రచ్చకెక్కడంతో స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో పోటీ పడాల్సిన నాయకులు.. ఆధిపత్యం కోసం తగాదాలకు దిగడమేంటని విసుక్కున్నారు. అయితే, ఎమ్మెల్యేగా కోరం కనకయ్య ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే అధికారులతో బయ్యారం సొసైటీలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీనిని ఓ వర్గం నాయకులు విభేదించడంతో ఎమ్మెల్యే వాయిదా వేశారు. అప్పటి నుంచే ఇరువర్గాల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మండల అధ్యక్షుడు కంబాల ముసలయ్య గురువారం ఒక ప్రకటనలతో తెలిపారు. సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి రెండు నెలల క్రితం బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోకుండా.., పది సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోసిన నాయకులపై పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీ వల బయ్యారం ఎంపీపీపై అవిశ్వాసం పెట్టి మిర్యాలపెంట ఎంపీటీసీ సోమేశ్‌ను ఎంపీపీ చేసే విషయంలో సైతం అడ్డుపడ్డాడని, గ్రూపు రాజకీయాలను ప్రో త్సహిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బయ్యారం కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి కొంతమందిని తమపైకి ఉసిగొల్పాడని, వారు చంపుతామని బెది రించారని తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్‌రెడ్డి గారి నాయకత్వంలో తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.