వరంగల్ చౌరస్తా : తెలంగాణ – చత్తీస్‌గఢ్ మధ్యలో ఉన్న కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్ర బలగాలతో మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి కేంద్రం శాంతి చర్చలకు పిలుపునియ్యాలని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు.
శనివారం ఎంసీపీఐ ఓంకార్ భవన్లో వామపక్ష, ప్రజా సంఘాల ప్రతినిధులతో సదస్సును నిర్వహించారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారపోయడానికే మోదీ ప్రభుత్వం నరమేధానికి పాల్పడుతుందని అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టులను, ఆదివాసులను కేంద్రం టార్గెట్ చేస్తుందని అన్నారు. ఇప్పటికే వందల ప్రాణాలు గాల్లోకలిపేశారని, ఇలానే కొనసాగితే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అభయారణ్యంలో రక్తాన్ని ఏరులై పారిస్తారని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించాలని అన్నారు. సదస్సు అనంతరం ఆపరేషన్ కగార్‌కి వ్యతిరేకంగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఎంసీపీఐ, ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.