గిర్మాజీపేట, మార్చి 3 : సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, మరోసారి గ్యాస్ ధరల పెంచిన మోదీ సర్కారుకు గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ శుక్రవారం వరంగల్ చౌరస్తాలో కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా చార్జీలతో కలిపి వంట గ్యాస్ ధర రూ. 1200 దాటి పోయిందని, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా? అని ఎద్దేవా చేశారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్న కేంద్రానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ధరలను వెంటనే తగ్గించి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచితంగా లభించే బియ్యం వండాలంటే రూ.1200 పెట్టి సిలిండర్ కొనాలా? అని ప్రశ్నించారు. మళ్లీ కట్టెల పొయ్యి మీద వంట చేసే పరిస్థితి తీసుకు వచ్చిన మోదీకి వచ్చే ఎన్నికల్లో మహిళా లోకం సత్తా ఎంటో చూపిస్తామని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్ గందె కల్పనానవీన్ పాల్గొన్నారు.