అజంజాహి మిల్లు కార్మిక భవనం కబ్జాపై అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులే తమ ప్రాథమిక విధిని మరచి విలువైన స్థలాన్ని కూల్చినా చర్యలు తీసుకోకుండా చోద్యం చూడడంపై అనుమానాలు రేకేతిస్తున్నది. రూ.కోట్లు విలువ జేసే 1450 గజాల భూమిలో ఓ వ్యాపారి ప్రైవేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సహకరించడం కార్మికలోకం భగ్గుమంటున్నది. భూమిపూజ జరిగి రెండు రోజులైనా అధికార యంత్రాంగం స్పందించకుండా మౌనం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కార్మికులకు మద్దతుగా నిరసనలు తెలుపుతున్నాయి. కబ్జాకోరులకు శిక్షించి, మిల్లు భూములను పరిరక్షించేదాకా ఉద్యమం తీవ్రతరం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి.
వరంగల్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్‌లో అజంజాహి మిల్లు కార్మికుల కోసం 75 ఏండ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించగా అప్పటినుంచి అందులోనే కార్మిక భవనం ఉన్నది. అయితే రూ. కోట్ల విలువ చేసే 1450 గజాల భూ మిలో మంత్రి భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అండదండలతో ఓ వ్యాపారి రెండు రోజుల క్రితం కాంప్లెక్సు నిర్మాణం కోసం భూమిపూజ చేశా రు. ఆ వెంటనే ఈ భవనాన్ని కూల్చివేశారు. అజంజాహి మిల్లు స్థలం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని గతంలో పలుమార్లు ప్రకటించిన అధికార యంత్రాంగం ఇప్పుడు ప్రైవేట్ కాంప్లెక్సు నిర్మిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేత ఒత్తిడి లేదా ప్రైవేట్ వ్యాపారికి సహకరించే ఉద్దేశంతోనే అధికారులు కబ్జా విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
కార్మికుల పోరుబాట..
కార్మిక భవన్‌ను కూల్చి ప్రైవేట్ కాంప్లెక్సు పనులు చేపట్టడంపై కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన బాట పట్టాయి. ఆ స్థలం కార్మికులకే ఉం టుందని, ప్రైవేట్ వ్యక్తులకు ఇక్కడ హక్కులు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నాయి. కార్మిక భవనం స్థలం కబ్జాకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాయి. మిల్లు ఉన్నప్పు డు కార్మికుల కోసం కేటాయించిన భవనం స్థలాన్ని తమకే ఇచ్చేలా చేస్తానని ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు దగ్గరుండి వ్యాపారికి అప్పజెప్పేలా వ్యవహరిస్తుండడంపై ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కబ్జా విషయమై ప్రభుత్వ పెద్దలను కలిసి ఫి ర్యాదు చేస్తామని, అధికార యంత్రాంగం తగిన చ ర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కాగా, అజంజాహి మిల్లు కార్మికుల భవనం కూల్చివేత, అందులో కమర్షియల్ కాం ప్లెక్స్ పనులు చేపట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించగా సీపీఎం, ఎంసీపీఐ, సీపీఐ ఎంఎల్, బీజేపీ నేతలు కూడా ఆ స్థలంలోనే నిరసన తెలిపారు. కార్మికుల సమస్యలు చర్చించుకునేందుకు 75 ఏండ్ల క్రితం అజంజాహి మిల్లు యాజమాన్యం యూనియన్ భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని.. మంత్రి భర్త స్వయంగా ఓ ప్రైవేటు వ్యాపారికి అప్పగించడం సరికాదని అన్నారు.
ప్రైవేటుకు ఎలా..?
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉపాధి కల్పన కోసం నిజాం సర్కారు హయాంలో వరంగల్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో అజంజాహి మిల్లును ఏర్పాటు చేశారు. మిల్లుతో 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగేది. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో 2003లో ఈ మిల్లు మూతపడింది. అనంతరం మిల్లు స్థలాన్ని అప్పటి ప్రభుత్వం ఎక్కువ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది.
కొంత స్థలాన్ని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇచ్చింది. మిల్లులో పనిచేసే కార్మికుల కోసం 1,450 గజాల స్థలాన్ని అప్పట్లో మిల్లు యా జమాన్యం కేటాయించింది. 75 ఏండ్ల క్రితం ఈ స్థలంలో కార్మిక భవన్‌ను నిర్మించారు. ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవల అధికార పార్టీ నేతల కన్నుపడింది. ప్రైవేట్ వ్యాపారితో కలిసి ఈ స్థలంలో కాంప్లెక్సు నిర్మాణం కోసం ఏకంగా భూమిపూజ చేయడం వివాదానికి కారణమైంది.