శాయంపేట జూన్ 14 : పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడింది. ఇష్టం వచ్చినట్లు రోడ్డు పకన చెట్లను నరికివేసి వదిలేశారు. దీంతో 2 కిలోమీటర్లకు పైగా రోడ్డుపైన చెట్లు పడిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శాయంపేట నుంచి కొత్తగట్టు సింగారం వెళ్లే బైపాస్ రోడ్డు పకన చెట్లను నరికేశారు. అయితే కొన్ని చెట్లను ఏకంగా సగానికి నరికి వేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్లన్నీ గతం లో హరితహారం అవెన్యూ ప్లాంటేషన్లో నాటినవి కావడం గమనార్హం. శాయంపేటతో పాటు పత్తిపాక, ప్రగతి సింగారం, మైలారం, కొప్పుల తదితర చుట్టుపకల గ్రామాలు, హనుమకొండకు వెళ్లేందుకు ఇదే ప్రధానదారి. అయితే నాలుగు రోజుక్రితం చెట్లను కొట్టేసి రోడ్డుపైనే వదిలేశారు. ఈ మధ్య గాలి దుమారం రావడంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ద్విచక్ర వాహనాలు వెళ్లడమే కష్టంగా మారింది. ఇక కార్లు, జీపులు వంటి వాహనదారులు తిరిగి వెనకి వెళ్లిపోతున్నా రు. రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, ఇప్పటికైనా రోడ్డుపై వేసిన చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.