నెక్కొండ, డిసెంబర్ 13: కరెంట్ కోతలపై అధికార యంత్రాంగం కదిలింది. మండలంలో ని అలంకానిపేట శివారు పరిధిలో బిల్లులు చెల్లించడం లేదని వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కరెంట్ కోతలు..ఎండిపోతున్న పంటలు’ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు నెక్కొండ ట్రాన్స్‌కో ఆపరేషన్స్ ఏడీఈ శ్రీధర్ శుక్రవారం గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు.
విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదనే సాకుతో గత నాలుగు రోజులుగా మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేస్తున్నారని రైతులు ఎండిన పంటలను ఏడీఈకి చూపించారు. విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదని ఎలాంటి కోతలు విధించమని ఆయన స్పష్టం చేసి రైతులను సముదాయించడంతో సమస్య సద్దుమణిగింది. శుక్రవారం ఉదయం నుంచి ఎలాంటి కోతలు విధించలేదని రైతులు తెలిపారు.
వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైనా సర్వీసులను డిస్ కనెక్షన్ చేస్తే ఉపేక్షించేది లేదు. వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో సంబంధిత లైన్ ఇన్స్పెక్టర్పై చర్యలుంటాయి. బిల్లులు చెల్లించలేదని వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం లేదు.
– ట్రాన్స్‌కో వరంగల్ ఎస్ఈ పీ మధుసూదన్‌రావు