స్టేషన్ ఘన్పూర్, మార్చి 16 : పార్టీ ఫిరాయింపుదారులు డిస్ క్వాలిఫై అవుతారని, ఈ నియోజకవర్గంలో మళ్లీ ఉపఎన్నిక వస్తుందనే ఆలోచనతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ శంకుస్థాపనలు చేశారని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. ఆదివారం శివునిపల్లిలో ముఖ్యమంత్రి బహిరంగ సభ సందర్భంగా రాజయ్యను స్టేషన్‌ఘన్‌పూర్‌లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ అడ్డుకుంటారోనని భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అక్రమ అరెస్ట్ చేసిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని శపించిన కడియంది, సీఎం రేవంత్ రెడ్డిది అపవిత్ర కలియిక అని పేర్కొన్నారు. ఒక పక్క ప్రభుత్వానికి ఆదాయం లేక జీతాలు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి రూ.800 కోట్లతో అభివృద్ధి చేస్తానని తూతూమంత్రంగా చేసిన శంకుస్థాపనలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
ఇప్పటికైనా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చకుండా, ప్రజలను వంచిస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను, ప్రజలకు చేస్తున్న మోసాలను పింక్ బుక్‌లో రికార్డు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని రాయితో కొడతానని చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన కడియంను రాజీనామా చేయించాలని లేదా ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాజయ్య డిమాండ్ చేశారు.