జయశంకర్ భూపాలపల్లి, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : తమకు రావాల్సిన పరిహారం కోసం ఆ వృద్ధ దంపతులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. భూపాలపల్లి గ్రామ శివారు బాంబులగడ్డ సమీప అడవికి దగ్గర ఊరికి చివరన విషపురుగుల మధ్య దశాబ్దాల తరబడి మామిడి తోటను పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. సింగరేణి ఓసీ-2 కోసం అధికారులు వీరి మామి డి తోటను బలవంతంగా స్వాధీనం చేసుకొని ఎకరాకు రూ.1.20 లక్షలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారు. సుమారు 400కు పైగా ఉన్న మామిడి చెట్లకు పరిహారం ఇవ్వలేదు.
చివరికి వారికి ఎకరన్నర భూమి మాత్ర మే మిగిల్చగా అందులో మిగిలిన మామిడి చెట్లు, కూరగాయల తోటలు సాగుచేస్తూ గోవులను సాకుతూ పూటగడుపుతున్నారు కాల్వపల్లి కనకరాజు, రాజేశ్వరి దంపతులు. కాగా సింగరేణి అధికారుల కన్ను మళ్లీ వృద్ధ దంపతులకు చెందిన ఎకరన్నర భూమిపై పడింది. అక్కడి నుం చి వారిని ఎలాగైనా ఖాళీ చేయించేందుకు అన్ని అస్ర్తాలు ప్రయోగిస్తున్నారు. వారి గుడిసెకు ఉన్న కరెంటును రాత్రికి రాత్రే కట్ చేశారు. గతంలో సింగరేణి సంస్థ వారి నివాసం కోసం ఇచ్చిన సింగరేణి క్వార్టర్‌కు సైతం కరెంటు, నీళ్లు కట్ చేసి ముప్పేట దాడి చేస్తుండడంతో ఆ వృద్ధ దంపతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం కరెం టు లేక చిమ్మ చీకట్లో ఆ దంపతులు ఊరికి ఆవల, విష పురుగుల మధ్య జీవనం కొనసాగిస్తున్నా సింగరేణి అధికారులు, పాలకులకు ఏ మాత్రం కనికరం లేకుండా పో యింది.
గుడిసెకు కరెంట్ కట్ చేయడంతో దూరంలో ఉన్న బావి వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకొని వంటలు చేసుకుం టూ.., గోవుల గొంతు తడుపుతూ బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. అయితే, ఓసీ కోసం భూమిని సింగరేణి సంస్థ తీసుకోగా మిగిలిన ఎకరన్నర భూమిని నమ్మకొని బతుకుతున్నారు. అయితే, ఈ స్థలానికి సైతం పరిహారం ఇచ్చామని సింగరేణి అధికారులు తెలుపుతుండగా, పరిహారం ఇస్తే ఆనాడే స్థలం ఎందుకు తీసుకోలేదని కనకరాజు దంపతులు ప్రశ్నిస్తున్నారు. దళితులమైన తమకు ఎస్సీ కార్పొరేషన్ బోర్లు మంజూరు చేసిందని, గుడిసెకు ఇంటి పన్ను కడుతున్నామని, ఆనాడే కరెంట్ మీటర్‌కు డబ్బులు కడుతామంటే వద్దన్నారని తెలిపారు. 40 ఏళ్లుగా కరెంటు తీయని అధికారులు ఇప్పుడు అర్ధరాత్రి దొంగల్లా వచ్చి కరెంటు కట్ చేస్తున్నారని, ప్రస్తుతం మీటరుకు మీ సేవలో దరఖాస్తు చేసి కరెంటు ఆఫీసులో అప్పగించినా సింగరేణి అధికారుల దాడులు ఆపడం లేదని ఆ దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఎమ్మెల్యే అభయమేది?
నెల రోజులుగా వృద్ధ దంపతులు తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసి వినతి పత్రం అందజేయడంతోపాటు ఆర్డీవో, కలెక్టర్ ను కలిసినా ఫలితం లేదు. పట్టించుకునే వారు కరువయ్యారు. ఎమ్మెల్యే ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వృద్ధ దంపతులను నిర్ధాక్షిణ్యంగా వెళ్లగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ వారం రోజులుగా చీకట్లో భయం భయంగా బతుకుతున్నాం.. ఇక్కడ మాకు ఏం జరిగినా ఎవరికీ తెలియదు.. చావుకు సిద్ధపడే ఇక్కడ బతుకుతున్నామని వారు వాపోయారు.