ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. వరంగల్ బస్‌స్టేషన్ ఆవరణలో ఆర్టీసీ కార్మికుల యూనియన్ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన వేడుకల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని ఉత్సాహం నింపారు. ఉద్యోగులు, కార్మికుల సంబురాలతో వరంగల్, పరకాల, నర్సంపేట డిపోల వద్ద సందడి నెలకొన్నది.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 1
నమస్తే నెట్వర్క్, ఆగస్టు 1 : టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ ఆర్టీసీ కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. హనుమకొండ బస్‌స్టేషన్‌తో పాటు ఆర్ఎం ఆఫీస్ వద్ద డీఆర్ఎంలు కృపాకర్‌రెడ్డి, మాధవరావు, హనుమకొండ డిపోలో డీఎం బి.ధరమ్‌సింగ్, వరంగల్-2 డిపోలో డీఎం సురేశ్, వరంగల్-1 డిపోలో డ్రైవర్ ఈఎస్బాబు ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించగా అధికారులు, కార్మికులు పాల్గొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అలాగే వరంగల్ బస్‌స్టేషన్ ఆవరణలో ఆర్టీసీ కార్మికుల యూనియన్ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన సంబురాల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కార్మికులకు, నాయకులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
అలాగే బస్‌స్టేషన్‌కు వివిధ రూట్లలో వెళ్లే బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు తమ సంతోషాన్ని పంచుకున్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, కార్మికులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆర్టీసీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని సంతోషం వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఆర్టీసీ డిపోలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి పటాకులు కాల్చి సంతోషాన్ని తెలియజేశారు. అలాగే వర్ధన్నపేట బస్టాండ్ ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి అజయ్, సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. మహబూబాబాద్ డిపో ఆవరణలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొని కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. తొర్రూరు డిపో వద్ద జరిగిన సంబురాల్లో డీఎం పరిమళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జనగామ డిపోలో జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలు, పూలతో అభిషేకం చేశారు. అలాగే డీఎం జ్యోత్స ఆధ్వర్యంలో సంబురాలు ఘనంగా నిర్వహించారు. పరకాల డిపో వద్ద సంబురాల్లో డీఎం రవిచందర్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.