హనుమకొండ, ఏప్రిల్ 28 : ‘బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్. త్యాగాల పునాదులపై రాష్ర్టాన్ని సాధించిన పార్టీ అధినేత కేసీఆర్ తన పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపారు. ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముంద్ర వేసుకున్నారు’ అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభకు ప్రతి పల్లె, పట్టణం నుంచి లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా విజయవంతం చేశారని, అందుకు వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఒకే ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ 14 ఏండ్లు తెలంగాణ అంతటా కలియదిరిగి, సమస్యలను గుర్తించడంతో పాటు తెలంగాణ ఏర్పాటు అనంతరం వాటిని పరిష్కరిస్తూ పదేండ్లలో దేశమే రాష్ట్రం వైపు చూసేలా అభివృద్ధి చేశారన్నారు. ప్రస్తుతం 16 నెలలుగా ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా పోషిస్తున్నామని తెలిపారు.
మ్యానిఫెస్టోలో పెట్టని సంక్షేమ పథకాలను సైతం అమలు చేశామని గుర్తు చేశారు. కేసీఆర్‌కు ప్రజల కష్టసుఖాలు తెలవడం, నిరుపేద ఆడపిల్లల పెళ్లికి ఎన్నో ఇబ్బందులుంటాయని కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేశారని తెలిపారు. రజతోత్సవ సభకు ప్రజలు సైకిళ్లు, టూ వీలర్స్, ఆటోలు, ఎండ్ల బండ్లు, పాదయాత్ర చేసుకుంటూ తరలివచ్చారన్నారు.
హనుమకొండ జిల్లాలో సభ నిర్వహించేందుకు సహకరించిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుటుంబ సభ్యులు, సభ కోసం భూములిచ్చిన స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సభ సందర్భంగా ఎవరికైనా ఇబ్బందులు కలిగిస్తే మన్నించాలని దాస్యం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ బొండు అశోక్‌యాదవ్, నాయకులు బీరెల్లి భరత్‌కుమార్, నయీముద్దీన్, సల్వాజి రవీందర్రావు, వీరేందర్, పోలపెల్లి రామ్మూర్తి, రఘు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు ఏ సభకు లేని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు యూజర్ చార్జీలు తీసుకున్నరు. ఇప్పటి వరకు ఏ సభకూ జరగలేదు. 2 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉంచుతామని కనీసం 200 మందిని ఏర్పాటు చేయలేదు. దరఖాస్తు చేసిన 10 రోజుల వరకు సభకు అనుమతి ఇవ్వకుంటే కోర్టు ద్వారా తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సభ ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతం చేశాం. పోలీసులు విఫలం కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో మేము రోడ్లపై విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.
మేము బారికేడ్లు పెట్టాలన్న చోట కాకుండా ఎక్కడెక్కడో పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. సాధారణంగా ఆదివారం ఎన్నడూ డ్యూటీకి రాని ఆర్టీవోలు విధులు నిర్వర్తించారు. వరంగల్, భూపాలపల్లిలో ఎన్నడూ లేని విధంగా జాబ్ మేళాలు పెట్టారు. ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న అభిమానాన్ని ఎవరూ చెరిపేయలేరు. మా సభను ఫెయిల్ చేయాలని కుట్రలు చేసినా కేసీఆర్‌ను చూడాలని, ఆయన మాటలు వినాలని ప్రజలు, యువత కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు.
సభ కోసం భూములిచ్చి సహకరించిన స్థానిక రైతులకు ధన్యవాదాలు. ఇంతకు ముందు వారి భూములు ఎలా ఉన్నాయో అలాగే చేసిచ్చే, పొలాల కాల్వలు, హద్దులు ఏర్పాటు చేసే బాధ్యత మాదే. సభ నిర్వహణలో భాగస్వాములైన మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో పాటు ఆయన క్యాడర్‌కు, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఏ ఒక పోలీసు సహకరించకున్నా రోజంతా కష్టపడి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పనిచేసిన మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మన ఇంట్లో ఫంక్షన్ చేసినా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఇకడ కూడా ఏమైనా జరిగితే క్షమించాలి.
-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ
చరిత్రాత్మక సభలకు వేదికగా నిలిచిన ఓరుగల్లు రజతోత్సవ సభను విజయవంతం చేసి మరోసారి చరిత్రలోకి ఎక్కింది. సభ నిర్వహించేందుకు అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్‌తో పాటు భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సభను విఫలం చేయాలనుకున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టుగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. కేసీఆర్‌కు దేవుడి ఆశీస్సులున్నాయి. ప్రకృతి సైతం సహకరించింది. ఎన్నడూ డ్యూటీలు చేయని ఆర్టీవోలు ఆదివారం రోడ్లుపైకి వచ్చి, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించారు.
సభకు బస్సులు పంపితే జరిమానా వేస్తామని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించారు. నా నియోజకవర్గంలో ఒక్క బస్సు ఇవ్వకుండా చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే చిల్లరగా వ్యవహరిస్తూ సభను చెడగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. పోలీసు విధులు మేము నిర్వర్తించాం. పోలీసులు అధికార పార్టీ చెప్పుచేతల్లో ఉండి దిగజారిపోయారు. సాయంత్రం 5 గంటల వరకే పోలీసులు చేతులెత్తేయడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
ప్రభుత్వ ఒత్తిడి మేరకే పోలీసులు ఇలా వ్యవహరించారు. డ్యూటీలో ఉన్న కొద్దిమంది పోలీసులు సభకు వచ్చే జనాలను అడ్డుకున్నారు. సభా వేదిక వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. 2 వేల మంది పోలీసులు ఎక్కడ డ్యూటీ చేశారో మేము పెట్టిన సీసీ కెమెరాల్లో చూస్తే తెలుస్తుంది. సభా వేదిక వద్ద భద్రత లేదు. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే బాధ్యులెవరు? సభ పూర్తయిన 5 నిమిషాలు కాకముందే మంత్రులు పొంగులేటి, సీతక్క, జూపల్లి సిగ్గులేకుండా ప్రెస్‌మీట్ పెట్టారు. మా పార్టీ పుట్టిన రోజు సభ పెట్టుకుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నరు.
ఒక మంత్రి మేము కుట్ర చేస్తే అంత మంది ఎలా వచ్చారంటే, మరో మంత్రి అసలు జనమే రాలేదంటున్నరు. మేము రైతుల నుంచి అనుమతి తీసుకున్న భూమిలో సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్‌లు పెట్టారు. ములుగురోడ్ వద్ద బస్సుల్లో వెళ్తున్న వారిని ఆర్టీవో సిబ్బంది ఆపి ఎండలో నిల్చోబెట్టారు. టోల్గేట్ల వద్ద కావాలని వాహనాలు నిలిపివేశారు. మా పాలనలో ఎవరికీ ఇలా ఇబ్బంది కలిగించలేదు. సభకు సహకరించిన ఎల్కతుర్తి రైతులు, భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. – పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే