హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని కాకతీయ యూనివర్సిటీ ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేయూ మొదటి గేటు వద్ద బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీజీపీఎస్సీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కేయూ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, ఇన్చార్జి జెట్టి రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 పరీక్ష నిర్వహించిన అనేక సెంటర్లలో అక్రమాలు జరిగాయని, వెంటనే రద్దు చేసి, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందరి అభ్యర్థులకు 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా, కోటి ఉమెన్స్ కాలేజీలో మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించిన రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారని, మిగిలిన 26 సెంటర్లలో 139 మంది ఎంపిక కావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
563 ఉద్యోగాల్లో కేవలం 9శాతం మంది మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులున్నట్లు టీజీపీఎస్సీ సీల్డ్ కవర్లో పేరొందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కలకోట్ల సుమన్, హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్స్ గండ్రకోట రాకేశ్యాదవ్, రాష్ట్ర నాయకులు గొల్లపల్లి వీరస్వామి, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కోరపెల్లి రాజేష్, రాసూరి రాజేష్, బుర్ర మహేష్ పాల్గొన్నారు.