వరంగల్ చౌరస్తా: అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఎడ్యుకేట్, ఇన్నోవేట్, ఆపరేట్ నినాదంతో 11వ వార్షిక కాన్సరెన్స్ నిర్వహిస్తామని తెలంగాణ విభాగం అధ్యక్షుడు డాక్టర్ దివ్వెల మోహన్ దాస్ తెలిపారు. మంగళవారం ఎంజీఎంహెచ్ ఆకాడమిక్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యాలయ, సమాచార కేంద్రాన్ని కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ – కిశోర్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 7వ తేదీన కాకతీయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు ఉంటుందని 8, 9వ తేదీలలో హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారన్నారు. శస్త్రచికిత్సల్లో వచ్చిన ఆధునాతన శాస్త్ర, సాంకేతిక మార్పులు, వినియోగం, ఉపయోగాలు అనే అంశాలపై నిపుణుల సందేశాలు, విశ్లేషణలు, వివరణలతో కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.
కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులుగా డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ కూరపాటి రమేష్, డాక్టర్ ముక్కా గోపీనాధ్, డాక్టర్ కే.సుధాకర్ రెడ్డి, డాక్టర్ అప్పాల సుధాకర్, డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ గోపాల్ రావు, డాక్టర్ నాగేంద్ర రావు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది వైద్యులు హాజరవుతారని అంచాన వేస్తున్నామని, నేటి నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.