నామినేటెడ్ పోస్టులపై అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులకు ఇచ్చిన పదవుల వ్యవహారం ఇప్పుడు నవ్వులాటగా మారింది. పోస్టులను ప్రకటించిన రోజు నుంచి లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఎవరూ బాధ్యతలు చేపట్టకపోగా, అసలు తమకు నిజంగానే పదవి ఉందా? లేదా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుగురికి చోటు దక్కినప్పటికీ పోస్టుల భర్తీపై పార్టీలోనే అసంతృప్తి నెలకొనడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోకుండానే పార్టీ గెలుపు కోసం పనిచేయని వారికి పదవులిచ్చారని మంత్రులు, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా, మరోసారి జాబితా పంపాలని సూచించినట్లు చర్చ నడుస్తోంది. అదే జరిగితే మళ్లీ మొదటికి వచ్చినట్టేనా అని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులకు ఇచ్చిన నామినేటెడ్ పదవుల వ్యవహా రం ఇప్పుడు నవ్వులాటగా మారింది. పదవులు పొందిన నేతలే నిజంగా తమకు పదవి ఉందా? లేదా? అని సందేహ పడుతున్నారు. పోస్టుల్లో నియమితులైన వారు ఇప్పటికీ బాధ్యతలు చేపట్టలేదు. అసలు ఆ యోగం ఉంటుందో లేదో అనే అనుమానంతో ఉన్నారు. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదవులు ఇస్తే వాటిని చేపట్టకపో యే పరిస్థితి రావడం ఏమిటని వీరంతా ఆందోళన చెం దుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సమీక్షించి పనిచేసిన వారు, గెలుపోటములు.. అన్నింటినీ ప్రా మాణికంగా తీసుకుని పదవులను కొనసాగించాలా? లేదా అనేది నిర్ణయిస్తామని ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. మం త్రుల అభిప్రాయాలు, ఇన్చార్జి మంత్రి ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని ఇటీవల కాంగ్రెస్ లో చర్చ మొదలైంది. ఇవన్నీ జరిగే వరకు ఎన్ని నె లలు పడుతుందో? పదవి ఎప్పుడు వస్తుందో? అని జాబితాలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ముందు తమకు ఇచ్చిన పదవులు వట్టివేనా అని లోలోపల మదనపడుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పలువురు కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పదవులను ఖరారు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు తేదీల్లోనే పదవులను భర్తీ చేసినట్లు పేర్కొ న్నా.. షెడ్యూల్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ ప్రకటనను బహిరంగంగా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 37 మందిని వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో భర్తీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరుగురు పదవులు దక్కిన జాబితాలో ఉన్నారు. వరంగల్ పశ్చిమ సెగ్మెంట్ టికెట్ ఆశించిన జంగా రాఘవరెడ్డిని ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్‌గా, మహబూబాబాద్ ఎంపీ సీటు ఆశించిన బెల్లయ్య నాయక్‌ను గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, ములుగు మా జీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్‌గా, పీసీసీ అధికార ప్రతినిధి ఎండీ రియాజ్‌ను గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా, భూపాలపల్లి జిల్లాకు చెందిన అయిత ప్రకాశ్‌రెడ్డిని స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా, పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఇనుగాల వెంకట్రాంరెడ్డికి కాకతీయ అర్బ న్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్‌గా నియమించారు. లోక్‌సభఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ నియామకాలను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రెండు రోజుల ముందు తేదీ పెట్టి ఈ ప్రకటనను విడుదల చేశారు. నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన రోజు నుంచి లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఎవరూ బాధ్యతలు స్వీకరించలేదు. ఈ పదవులు తమకు ఉంటా యా? ఉండవా అనే ఆందోళనలోపదవులు పొందిన వారు ఉన్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీలో రచ్చ మొదలైంది. తమను, తమ ప్రతిపాదనలను కనీసం పరిశీలించకుండా పదవులు ఇచ్చారని, ఇది పార్టీకి నష్టం చేస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. నామినేటెడ్ పోస్టుల జాబితాలో ఉన్న వారిలో కొందరు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయలేదని, ఇలాంటి వారికి పదవులు ఇస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు పోతాయని చర్చ మొదలైంది. నామినెటేడ్ పోస్టుల భర్తీ కోసం మరోసారి ఉమ్మడి జిల్లాల వారీగా జాబితా తయారు చేయాలని ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్చార్జి మంత్రి కలిసి ఈ ప్రతిపాదనలు పంపేలా అధిష్టానం నుంచి సూచనలు వచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. కొత్త ప్రక్రియ మొదలై, ప్రతిపాదనలు అధిష్టానానికి చేరి పోస్టులను భర్తీ చేసే వరకు ఎన్ని రోజులు పడుతుందోనని ఆశావహులు టెన్షన్ పడుతున్నారు.