శివ నామస్మరణతో ఆలయాలు కిటకిటలాడాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, ములుగులోని రామప్ప ఆలయాలు, ఇతర శివాలయాలు సందడిగా మారాయి. కాళేశ్వరం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వదిలి నదికి ప్రణమిల్లారు.
హనుమకొండ చౌరస్తా/కాళేశ్వరం/వెంకటాపూర్, డిసెంబర్ 11 : ఉమ్మడి జిల్లాలోని శివాలయాలు సోమవారం కిటకిటలాడాయి. కార్తీక మాసం ముగింపు సందర్భంగా వేలాది మంది భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. వేయిస్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. కాళేశ్వరం వద్ద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వదిలారు.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి వివిధ జిల్లాలతో పాటు సమీప మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యతో తరలిరావడంతో త్రివేణి సంగమం పులకించింది. గోదావరి పుష్కరఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానలు చేశారు. నదిలో దీపాలు వదిలి, సైకత లింగాలను పూజించారు. ఆలయానికి ఒక్కరోజే రూ.7.50లక్షల అదాయం సమకూరినట్లు ఈవో మహేశ్ తెలిపారు.
పాలంపేటలోని రామప్ప ఆలయంలో భక్తులు, అయ్యప్ప స్వాములు, పర్యాటకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. అర్చకులు హరీశ్‌శర్మ, ఉమమాశంకర్ ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శివ లింగాన్ని మహాశివుడిగా అలంకరించారు. భక్తులు మారేడు చెట్టుకింద దీపాలు వెలిగించారు.
చారిత్రక వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించి సోమవారం మధ్యా హ్నం 12 గంటలకు గోధూళి లగ్నంలో రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామివార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శివపీఠంపై ప్రతిష్టించి గణపతి ఆరాధన కలశ స్థాపన, నవగ్రహారాధన, అంకురార్పణ, మంటపారాధన, దీపారాధన నిర్వహించారు. బోసు ప్రమోద్‌కుమార్ దంపతుల ఆధ్వర్యంలో వేదపండితులు కోమాళ్లపల్లి సంపత్‌కుమార్‌శర్మ యాగ్నికంలో కల్యాణక్రతువు నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. స్వామివార్ల పాదప్రక్షాళన సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడులు, పుష్పార్చన, షోడశోపచార పూజలు చేసి నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం రుద్రేశ్వరునికి 51 కిలోల పెరుగన్నంతో మహాన్నపూజ చేశారు. స్వామివారిని కార్తీక దామోదరునిగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం ప్రముఖ ధార్మికవేత్త సోమశేఖరశర్మ కార్తీక పురాణ ప్రవచనాలు గావించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.