కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కార్డులకు మోక్షం కలగడం లేదు. తొలుత ప్రజాపాలన ద్వారా ఆ తర్వాత గ్రామ, వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి మీ సేవలో కూడా అర్జీలు పెట్టుకోవాలని సూచించడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి పలుమార్లు దరఖాస్తులు స్వీకరించి విచారణ కూడా చేసినప్పటికీ కార్డుల పంపిణీ మాత్రం కాలేదు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి చేయడంతో ఇప్పటివరకు కార్డు లేని వారికి పథకాలు రాకుండా పోతున్నాయి. దీంతో కొత్త కార్డులు, పిల్లల పేర్ల కోసం అర్జీ పెట్టుకున్న వేలాది మంది నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు స్వీకరించడం, విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్ప కొత్తగా ఒక్క కార్డు ఇచ్చింది లేదని ప్రజలు మండిపడుతున్నారు.
– మహబూబాబాద్/జనగామ, మే 4(నమస్తే తెలంగాణ)
తరిగొప్పులకు చెందిన చంద్రశేఖర్‌కు పదేండ్ల క్రితం వివాహమైంది. తొమ్మిదేళ్ల కూతురు, ఏడేళ్ల వయస్సు కుమారుడు ఉన్నారు. రేషన్‌కార్డులో పిల్లల పేర్లు చేర్చేందుకు ఏడాది క్రితం మీసేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేశారు. అప్పుడు మీ సేవ నిర్వాహకులు స్లిప్ ఇచ్చారు. అయితే ఇంతవరకూ పిల్లల పేర్లు కార్డులో యాడ్ కాకపోవడంతో మీ సేవకు వెళ్లి మరోసారి దరఖాస్తు చేయడానికి ప్రయత్నించారు. ఇంతకు ముందే మీరు దరఖాస్తు చేశారు.. ఆ స్లిప్ తెస్తే మీ స్టేటస్ చెబుతామని మీ సేవలో చెప్పడంతో ఇంటికి వెళ్లి ఎంత వెతికినా ఆ స్లిప్ దొరకలేదు. తిరిగి దరఖాస్తు చేసేందుకు వీలు కావడం లేదు. ఏం చేయలేక ఆందోళన చెందుతున్నారు. ఇలా పరశురాము లు, చంద్రశేఖర్ మాత్రమే కాదు.. జనగామ జిల్లాలోని వేలాది మంది నిరుపేదలు పడుతున్న బాధలు. కొత్త రేషన్‌కార్డుల కోసం పేదల పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.
అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన ప్రజాపాలన సభల నుంచి మీసేవా కేంద్రాల్లో చేసుకున్న దరఖాస్తులకు 17నెలలు గడిచినా మోక్షం లేదు. ఇంటింటా సర్వేకు వచ్చిన సందర్భాల్లోనూ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవడంతో కొత్త కార్డులు వస్తాయని ఆశపడ్డారు. అయితే గతంలో ఉమ్మడిగా ఉండి కుటుంబాలు వేరుపడ్డాక కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పాత కార్డుల్లో పేర్లు తొలగించుకుంటేనే దరఖాస్తు చేసేందుకు వీలవుతుందని చెప్పడంతో ఉరుకులు పరుగులపై తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్లి పేర్లు తొలగించుకున్నారు.
కొత్త రేషన్‌కార్డుల జాడ కనుచూపు మేరలో కూడా కానరాక.. ఎప్పుడొస్తాయో కూడా తెలియక నిరుపేదలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. 2023 డిసెంబర్లో అధికారం చేపట్టాక తొలుత ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత గ్రామ, వార్డుసభలు నిర్వహించి రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు స్వీకరించారు. ఆ తర్వాత మీ సేవా కేంద్రాల్లో అర్జీ పెట్టుకోవాలని సూచించారు. ఒక్క రేషన్‌కార్డు కోసం ఒక్కో వ్యక్తి మూడు, నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో విచారణ కూడా చేశారు.
జనగామ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డుకు చెందిన పి.పరశురాములుకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమారులకు ఆ రేండ్ల క్రితం వివాహాలు జరిగాయి. వారిద్దరికి ఇద్దరేసి చొప్పున పిల్ల లు ఉన్నారు. రోజూవారీగా కూలి పనులకు వెళ్లే కుటుంబం వారిది. అయితే చాలా సంవత్సరాల నుంచి వారి రేషన్‌కార్డులో ఐదుగురు సభ్యులు ఉన్నారు. కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవా కేంద్రానికి వెళ్తే రేషన్‌కార్డులో మీ పేర్లు తొలగించుకుంటే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకునే వీలుంటుందని చెప్పడంతో అన్నదమ్ములిద్దరు అప్పట్లో జనగామ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి పేర్లు డిలిట్ చేయించారు.
దరఖాస్తు చేద్దామని మళ్లీ మీ సేవకు వెళ్తే మీ ఒక్కరిదే కాదు.. మీ భార్యల పేర్లు కూడా ఇదే మాదిరిగా మీ అత్తగారి కార్డు నుంచి తొలగించుకోవాలని చెప్పారు. దీంతో హుటాహుటిన వారి అత్తగారి ఊళ్లకు వెళ్లి భార్యల పేర్లను రేషన్‌కార్డుల నుంచి డిలీట్ చేయించుకొని వచ్చారు. జనగామలోని మీ సేవలో వారి భార్యలు, పిల్లల ఆధార్‌కార్డులు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జతచేసి దరఖాస్తు చేశారు. ఇది జరిగి సుమారు ఎనిమిది నెలలు అవుతున్నది. కానీ ఇంతవరకు కొత్త రేషన్‌కార్డు రాలేదు.
అప్పటివరకు వారికి 30 కిలోల బియ్యం నెలనెలా వచ్చేవి. అవి కాస్త 18 కిలోలకు తగ్గాయి. ఇదే మాదిరిగా వారి అత్తగారి కార్డులో కూడా ఆరు కిలోల చొప్పున బియ్యం తగ్గాయి. కానీ ఇప్పటివరకు కొత్త కార్డు రాలేదు. కనీసం ఏ అధికారి కూడా విచారణకు వచ్చింది లేదు. కార్డు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. కొత్త కార్డు మాటేమో కానీ అటు అత్తగారింట్లో.. ఇటు తల్లిగారి ఇంట్లో ఉన్న బియ్యం పోయాయని దరఖాస్తుదారులు బాధపడుతున్నారు.
కొత్త రేషన్‌కార్డుల కోసం జనగామ జిల్లాలో 33,500, మహబూబాబాద్ జిల్లాలో 51,775 దరఖాస్తులు స్వీకరించగా 15,342 అఫ్రూవల్ చేశారు. కొత్త రేషన్‌కార్డు వస్తేనే ఇంటి అవసరాల కోసం వినియోగించే ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, సబ్సిడీ గ్యాస్, ఇతర సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి చేయడం తో ఇప్పటివరకు కార్డు లేని వారికి పథకాలు రా కుండా పోతున్నాయి. రేషన్‌కార్డులు ఇస్తే మళ్లీ పథకాలకు దరఖాస్తులు వస్తాయి. దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని భావించి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడంలో తీవ్ర జా ప్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసిన. ప్రజాపాలనలో ఒకసారి, గ్రామ సభ జరిగినప్పుడు రెండోసారి, మీసేవలో మూడోసారి దరఖాస్తు ఇచ్చిన. దరఖాస్తు చేసి సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త రేషన్‌కార్డు రాలేదు. కార్డు వస్తే ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే ఏ పథకానికీ దరఖాస్తు చేయాలన్నా రేషన్‌కార్డు అడుగుతున్నారు. అధికారులు ఇప్పటికైనా కార్డు వచ్చేలా చూడాలని కోరుతున్నా.
– బుర్ర మధు, ఇనుగుర్తి, మహబూబాబాద్ జిల్లా