హనుమకొండ, సెప్టెంబర్ 29: రాబోయే పారా ఆసియన్ గేమ్స్2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెట్టారు. ఈ ట్రయల్స్ఈనెల 27 నుంచి 28 వరకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో నిర్వహించగా పారా ఆసియన్ గేమ్స్డిసెంబర్ మొదటి, రెండవ వారాల్లో దుబాయ్‌లో జరగనున్నాయి. కాగా, వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అకుల లోకేష్ అండర్-80కిలోల విభాగంలో 2వ స్థానం నిలిచి ఆసియన్ గేమ్స్‌కు ఎంపిక కాగా, మహబూబ్‌నగర్‌కు చెందిన లింగప్ప అండర్-58 కిలోల విభాగంలో 3వ స్థానం సాధించి తన ప్రతిభను, పట్టుదలను చాటుకున్నారు.
ఈ ఇద్దరు అథ్లెట్లు తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ తరఫున నిపుణులైన కోచ్ ఎల్లావుల గణేశ్‌యాదవ్ మార్గదర్శకత్వంలో పాల్గొన్నారు. ఆయన కఠిన శ్రమ, శిక్షణ ఈ విజయానికి కీలకంగా నిలిచాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ దిలీప్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్, జాయింట్ సెక్రటరీ భాస్కర్, రెడ్యానాయక్, చిరంజీవి, అజరుద్దీన్ ఆటగాళ్లను అభినందించి, వారి కృషిని, పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇండియా తైక్వాండో వైస్ ప్రెసిడెంట్ వీణ కూడా తెలంగాణ అథ్లెట్లను, అసోసియేషన్‌ను వారి నిరంతరశ్రమ, అంకితభావం, జాతీయ స్థాయిలో చూపిన అద్భుత ప్రదర్శనకు అభినందించారు.