నర్సంపేట రూరల్, ఆగస్టు 26: కాంగ్రెస్‌వి మోసపూరిత మాటలని, ఆ పార్టీ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని నాగుర్లపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన అనేక మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ప్రపంచ దేశాలు సైతం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల వైపు చూస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు పార్టీలో చేరుతున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్లోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తున్నదన్నారు. నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, క్లస్టర్ ఇన్చార్జిలు కడారి కుమారస్వామి, మోతె పద్మనాభరెడ్డి, నాయకులు మచ్చిక రవితేజ, పెరుమాండ్ల కట్టస్వామి, రమేశ్, రాజు, వెంకన్న, సాంబయ్య, సురేశ్, సారయ్య పాల్గొన్నారు.
అభివృద్ధిలో చెరగని ముద్ర
నెక్కొండ: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చెరగని ముద్ర వేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బంజరుపల్లి గ్రామానికి చెందిన 40 కాంగ్రెస్ కుటుంబాలు క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రంలోనే నర్సంపేటకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నట్లు వివరించారు. అభివృద్ధికి ఆకర్షితులై నిత్యం విపక్షాల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా బీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సూరయ్య, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, సర్పంచ్ బదావత్ స్వరూపా రవి పాల్గొన్నారు.