రంగారెడ్డి, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ ద్వారా జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశమున్నది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. కానీ, ఇప్పటివరకు 23,07,899 మంది మాత్రమే ఫారాలను తిరిగి బీఎల్వోలకు అప్పగించగా.. మరో 13,91,844 మంది ఇవ్వలేదు.
వీరంతా గడువులోపు ఫారాలు సమర్పించకుంటే తమ ఓటు హక్కును కోల్పోనున్నారు. శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ తదితర నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ 50-55శాతమే పూర్తయ్యింది. ఈ నియోజకవర్గాల్లో ఎక్కువమం ది ఓటర్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసొచ్చి వివిధ పనులు చేసుకుంటూ ఇక్కడ జీవిస్తూ ఓటు హక్కును పొందారు. సర్ ప్రక్రియలో భాగంగా వీరంతా తమ ఓట్లను సొంత ఊర్లల్లోనే నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఆరు నుంచి ఎనిమిది లక్షల ఓట్లు తగ్గే అవకాశాలున్నాయి.
జిల్లాలో 63శాతమే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. ఫారాలను 85శాతం వరకు ఓటర్లకు అందించగా.. మరో 25శాతం వర కు రావాల్సి ఉన్నది. ప్రజలు గడువులోగా ఫారా లను నింపి తిరిగి బీఎల్వోలకు అందించకపోతే ఓట్లు గల్లంతయ్యే అవకాశముందని భావించిన కలెక్టర్ నారాయణరెడ్డి..అర్హుల ఓటరు ఫారాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడంలేదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఇక్కడ ఇతర ప్రాంతాల వారి ఓట్లు ఉండటంతో వా రంతా స్వగ్రామాల్లోనే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతుండటంతో జిల్లాలో 70శాతానికి మించి పెరిగేలా కనిపించడంలేదు. అర్హులు ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్ఐఆర్ ప్రక్రియ జిల్లాలో వందశాతం పూర్తిచేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
షాద్నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 84 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ సెగ్మెంట్లో 2,44,426 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 2,05,317మంది ఓటర్ల ఫారాలు ఆన్లైన్ అయ్యాయి. అలాగే, కల్వకుర్తి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు కూడా ఈ ప్రక్రియలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, సర్ ప్రక్రియలో ఎల్బీనగర్ నియోజకవర్గం వెనుకబడింది. ఈ సెగ్మెంట్లో ఇప్పటివరకు 53శాతమే డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఇక్కడ 6,082,03 మంది ఓటర్లుండగా 3,82,000 మాత్రమే ఆన్లైన్ అయింది.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండా మిగిలిన ఉన్న ప్రతి ఓటరును గుర్తించి, వారికి ఓటు హక్కును కల్పించాలి. శని, ఆదివారాల్లో ఎక్కువమంది ఇండ్ల వద్దనే ఉంటారని బీఎల్వోలు ఫారాలు ఇవ్వని వారి వివరాలను సేకరించి వాటిని తీసుకుని వెంటనే ఆన్లైన్ చేయాలి.
-నారాయణరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్