హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర మరువలేనిదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. పెద్ది అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. పెద్ది ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్‌లో స్పందిస్తూ పెద్ది అకాల మరణం బాధాకరమని, వారికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ..పెద్ది మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోయడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సహచరుడి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ స్పందిస్తూ వరంగల్ జిల్లా రాజకీయాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డిది చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతి క్షణాన్నీ ప్రజల కోసం అంకితం చేశారని ఆయన సేవలను స్మరించుకున్నారు.