Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం తొమ్మిదో రోజు ఎపిసోడ్ వినోదం, వాగ్వాదాలు, భావోద్వేగాలతో సాగింది. ముఖ్యంగా దేబ్జానీ మరోసారి ఎపిసోడ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఒకవైపు ముఖేష్ గౌడతో ఆమె మధ్య సరదాగా సాగిన ప్రేమ వ్యవహారం నవ్వులు పూయిస్తే.. మరోవైపు కెప్టెన్సీ పోటీకి సంబంధించిన టాస్క్‌లో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తిని పెంచింది. ఎపిసోడ్ ప్రారంభంలో ‘డార్లింగ్’ అనే పదంపై ఇంట్లో చర్చ జరిగింది. ఈ పదాన్ని చాలామంది తప్పుగా ఉపయోగిస్తున్నారని దేబ్జానీ చెప్పింది. కనీసం ‘డార్లింగ్’ స్పెల్లింగ్ కూడా చాలామందికి తెలియదంటూ నరేష్ ముందు వ్యాఖ్యానించింది.దీంతో నరేష్ ఆ పదాన్ని స్పెల్లింగ్ చెప్పే ప్రయత్నం చేశాడు. వెంటనే దేబ్జానీ ఫన్నీగా స్పందిస్తూ.. “ఏ.. నువ్వు కాదు.. షటాప్” అంటూ చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. దేబ్జానీ మాట్లాడే విధానం, ఆమె టైమింగ్ ఈ సన్నివేశాన్ని మరింత వినోదాత్మకంగా మార్చాయి.
ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ వద్ద ముఖేష్ గౌడ, వర్షిణి కలిసి స్విమ్ చేశారు. ఈ సమయంలో ముఖేష్ షర్ట్ లేకుండా స్విమ్మింగ్ చేయడాన్ని చూసిన దేబ్జానీ.. తనదైన శైలిలో రియాక్ట్ అయింది. తనకు ముఖేష్ అంటే ఇష్టమని ఇప్పటికే చెప్పానని, అయినా తనను పట్టించుకోకుండా వర్షిణితో కలిసి షర్ట్ లేకుండా స్విమ్ చేశాడంటూ దేబ్జానీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తనను మోసం చేశాడంటూ సరదాగా రచ్చ చేసింది.దేబ్జానీ చేసిన ఈ వ్యాఖ్యలకు రామ్ ప్రసాద్ కూడా మద్దతు ఇవ్వడంతో సన్నివేశం మరింత కామెడీగా మారింది. “మా చెల్లినే మోసం చేస్తావా?” అంటూ రామ్ ప్రసాద్ కూడా ముఖేష్‌ను ఆటపట్టించాడు. వాష్‌రూమ్ ప్రాంతంలో జరిగిన ఈ సరదా సంభాషణ ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచింది.
మరోవైపు సుధీర్ వ్యవహారంపై త్రిగుణ్ తీవ్రంగా స్పందించాడు. టిష్యూస్ పడేయడం విషయంలో సుధీర్ వ్యవహరించిన తీరుపై తనకు అభ్యంతరం ఉందని చెప్పాడు. అలాగే షాలినికి సపోర్ట్ చేసిన విషయంలోనూ సుధీర్‌ను త్రిగుణ్ తప్పుపట్టాడు. ఒక దశలో సుధీర్ ముఖం కూడా చూడాలని అనిపించడం లేదంటూ త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. అయితే తర్వాత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. సృష్టి విషయంలో సుధీర్ తన గురించి తెలియకుండా మాట్లాడాడని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశాడని త్రిగుణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల ఎంపికలోనూ బిగ్ బాస్ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈసారి ఎవరికి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఇవ్వాలనే విషయాన్ని ప్రేక్షకులే నిర్ణయించారు.
ప్రేక్షకుల ఎంపిక ద్వారా దేబ్జానీ, త్రిగుణ్, అమన్, షాలిని, ముఖేష్ గౌడ, రోహిత్, ఝాన్సీ, రామ్ ప్రసాద్ కెప్టెన్సీ కంటెండర్లుగా పోటీలో నిలిచే అవకాశం పొందారు.కెప్టెన్సీ కంటెండర్ల కోసం నిర్వహించిన టాస్క్‌లో గజిబిజిగా ఉన్న అక్షరాలను సరిచేసి పదాన్ని గుర్తించాల్సి వచ్చింది. ఈ పోటీలో ముందుగా త్రిగుణ్ ఎలిమినేట్ అయ్యాడు. అనంతరం అతడిని కెప్టెన్ అయ్యేందుకు అనర్హుడిగా పలువురు కంటెస్టెంట్లు పేర్కొన్నారు.తర్వాత రామ్ ప్రసాద్, దేబ్జానీ, రోహిత్ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఝాన్సీ, షాలిని, అమన్, ముఖేష్ గౌడ మధ్య పోటీ కొనసాగింది. వీరిలో అమన్, ముఖేష్ గౌడ కూడా ప్రమాదంలో ఉన్నట్లు ఎపిసోడ్లో కనిపించింది. ఈ టాస్క్ తదుపరి దశలో మరిన్ని ట్విస్టులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
కెప్టెన్సీ టాస్క్‌లో దేబ్జానీని ఎలిమినేట్ చేయడానికి కొందరు కంటెస్టెంట్లు ఆమెకు తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదనే కారణాన్ని ప్రస్తావించారు. అయితే ఆమెకు మద్దతుగా పలువురు కంటెస్టెంట్లు మాట్లాడటంతో పరిస్థితి మారిపోయింది.తనకు ఇంతమంది సపోర్ట్ చేయడం చూసి దేబ్జానీ సంతోషం వ్యక్తం చేసింది. ఇదే తనకు అసలైన సక్సెస్ అంటూ చెప్పింది. అదే సమయంలో షాలినితోనూ ఆమెకు వాగ్వాదం జరిగింది.మొత్తంగా మంగళవారం ఎపిసోడ్లో దేబ్జానీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.