చెత్తలో పలు రకాలు.. తడి చెత్త.. పొడి చెత్త.. వీటితో పెద్ద ముప్పులేదు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీ సైక్లింగ్ కూడా ఘనంగానే జరుగుతున్నది. ఎవరికీ పట్టని చెత్త.. ప్లాస్టిక్ వ్యర్థాలు! ప్లాస్టిక్ కవర్లు, ప్యాకెట్ల పట్ల నిర్లిప్తత.. భూమండలాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఇవీ చెత్తే కదా అని తీసిపారేయలేదామె! వాటినే పెట్టుబడిగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించింది. వ్యర్థాలతో అర్థవంతమైన వస్తువులను తయార చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నది పూణెకు చెందిన అమితా దేశ్‌పాండే!
టేస్టీ చిప్స్ యమ్మీ యమ్మీగా ఆరగించేంత వరకు కవర్ చేతుల్లో భలేగా ఇమిడిపోతుంది. చిప్స్ అయిపోయాక.. ఆ కవర్ చేసే కరకర శబ్దం చెవికి విసుగు పుట్టిస్తుంది. వెంటనే బలం కొద్దీ పిడికిల్లో నలిపేసి ఎటో విసిరేస్తాం! అలా నేలపాలైన కవర్.. గాలిలో గింగిరాలు కొడుతూ మురికి కాల్వలోకి చేరుకుంటుంది. మురుగుతో ప్రవహించి వాగులోకి చేరుతుంది. అక్కణ్నుంచి నదిలోకి.. ఏ ఒడ్డుకో చేరి మట్టిలో కూరుకుపోయి.. నేలను చెరుపుతుంది. ఒక్క చిప్స్ ప్యాకెట్టే ఇంత రాద్ధాంతం చేస్తే… మనం రోజూ వినియోగించే చిరుతిళ్ల ప్యాకెట్లు, పాలిథీన్ కవర్లు, నూనె ప్యాకెట్లు, దుస్తుల కవర్లు ఇవన్నీ కలిసి చేసే విధ్వంసం ఎంత ఉంటుందో ఊహించగలమా? ఆ విధ్వంసాన్ని అడ్డుకోవడంతోపాటు వాటితో నయా సృష్టికి నాంది పలికింది అమిత.

పూణెకు చెందిన అమిత ఇంజినీరింగ్ పట్టభద్రురాలు. అమెరికాలో కొన్నాళ్లపాటు ఐటీ కొలువు చేసింది. భర్త కూడా ఐటీ ఉద్యోగే! ఉన్నతోద్యోగం, మంచి జీతం. సుకూన్ లైఫ్. కానీ, సృజనాత్మకత పాళ్లు ఎక్కువగా ఉన్న అమితకు ఆ లైఫ్ ఎందుకో బోరింగ్‌గా అనిపించింది. అమితానందం అంటే.. మన జీవితం పదిమందికీ ఉపయోగపడటమే అన్నది ఆమె ఫిలాసఫీ! నలుగురికి ఉద్యోగాలు ఇచ్చి, వారి జీవితాల్లోనూ ఆనందాన్ని నింపడమే నిజమైన విజయం అనుకుంది. అందులో భాగంగానే ఇండియాకు వచ్చేసి ఏదైనా వ్యాపారం చేయాలని భావించింది అమిత. ఆమె ఆలోచనకు భర్త కూడా వంత పాడటంతో 2013లో అమెరికా నుంచి పూణెకు మకాం మార్చారిద్దరూ! ఎంత సంపాదిస్తే మాత్రం ఉన్నదంతా పెట్టుబడి పెట్టే వెర్రి సాహసం చేయలేదు అమిత. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడది ఏటా కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే సంస్థగా ఎదిగింది.
వ్యాపారం ప్రారంభించే ముందు ప్లాస్టిక్‌ను పునర్వినియోగం చేయాలని భావించింది అమిత. అలా చేస్తే.. కొంతలో కొంతైనా ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టవచ్చు కదా అన్నది ఆమె ఆలోచన. ఆ దిశగా ఎన్నో పరిశోధనలు చేసింది. స్పష్టమైన అవగాహన కలిగిన తర్వాత 2015లో భర్తతో కలిసి ‘ది ఎకోసోషల్ ట్రైబ్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను మొదలుపెట్టింది. అక్కడ తయారయ్యే వాటిని ‘రీ చర్ఖా’ బ్రాండ్ పేరుతో విపణిలో విడుదల చేసింది. చర్ఖాది.. స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర. విదేశీ వస్తు బహిష్కరణకు ఊతమిచ్చిన ఆయుధం కూడా అదే! ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా మొదలుపెట్టిన తన యజ్ఞానికి ‘రీ చర్ఖా’ అని నామకరణం చేశానంటుంది అమిత. ఆ పేరుతోనే తన ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టింది.
ఇక్కడ ఫ్యాన్సీ డ్రెస్‌లు తయారవ్వవు. పట్టు చీరలు అంతకన్నా కాదు. ఈ సంస్థ నుంచి ప్లాస్టిక్ కవర్లతో తీర్చిదిద్దిన బ్యాగులు పుట్టుకొస్తాయి. రంగురంగుల బ్యాగ్‌లు, పొట్లీ బ్యాగ్‌లు, లంచ్ బ్యాగ్‌లు, లాండ్రీ బ్యాగ్‌లు, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు ఇలా.. రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి బ్రాండ్ బ్యాగులంత మన్నికగా కనిపిస్తాయి. రూ.500 నుంచి రూ.5000 ధర పలికే ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ముంబై, పూణె నగరాలతోపాటు దేశదేశాలకూ వీళ్ల బ్యాగులు ఎగుమతి అవుతున్నాయి.

రీ చర్ఖా ఉత్పత్తులన్నీ మనం పారేసే వేపర్లు, ప్లాస్టిక్ ప్యాకెట్ల నుంచి తయారైనవే. ముందుగా సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను చక్కగా శుభ్రపరుస్తారు. తర్వాత వాటిని ఆరబెట్టి సన్నగా కట్ చేస్తారు. వాటిని చర్ఖాపై కండెలుగా చుట్టి, వాటిని మగ్గంపై వస్త్రంలా నేస్తారు. ఇలా నేసిన ప్లాస్టిక్ కవర్ షీట్‌ను కావాల్సిన సైజు వారీగా కట్‌చేసి, మెషిన్ మీద బ్యాగులా కుడతారు. ప్రస్తుతం ఆమె సంస్థలో పదుల సంఖ్యలో గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఏటా సుమారు రెండు కోట్ల టర్నోవర్ సాధిస్తున్న రీ చర్ఖా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతున్నది. అదే సమయంలో నేలతల్లికి ఎంతో కొంత ప్లాస్టిక్ భారం తగ్గుతున్నది. ముంబై, పూణె, థానెలో రీ చర్ఖా ప్రత్యేక షోరూమ్‌లు ఉన్నాయి. ఆన్లైన్ అంగట్లో అయితే సరే సరి! రెండు పరిశ్రమలు నెలకొల్పి ఈ ఉత్పత్తులను తీసుకొస్తున్నది అమిత.
‘నా ప్రయత్నం ఇంత విజయవంతం అవుతుందని నేను అనుకోలేదు. సరికొత్త ఆలోచనతో ముందడుగు వేశా! ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మళ్లీ అదే ప్లాస్టిక్ బ్యాగ్ తయారు చేస్తే పర్యావరణానికి లాభం ఏంటి? అని అడగొచ్చు. గాలికి ఎగిరిపోయి.. ఎక్కడో తేలే రేపర్లు గాలిలో ధూళికణాల కన్నా ఎక్కువగానే ఉన్నాయనిపిస్తుంది. వాటిలో కొన్నిటినైనా తగ్గించగలుగుతున్నాం. వాటితో తయారైన ఉత్పత్తి మన చేతుల్లో చాలాకాలం మన్నికగా ఉంటుంది. శిథిలావస్థకు చేరిన తర్వాత ఆ బ్యాగ్‌ను మనం ప్రాపర్‌గా చెత్తలో వేస్తాం, అది ఓ పద్ధతి ప్రకారం రీసైకిల్ అవుతుంది కదా! అలా నా ఉత్పత్తుల కోసం సేకరించిన వ్యర్థాల భారం భూమికి తగ్గినట్టే కదా’ అంటుంది అమిత. ఆమె మాటా నిజమే! ఓ ఖాళీ పాల ప్యాకెట్‌ను తేలిగ్గా బాల్కనీ నుంచి బయటికి విసిరేయగలం. కానీ, మనం నాలుగైదేండ్లు ఉపయోగించుకున్న కలర్‌ఫుల్ బ్యాగ్‌ను అంత ఈజీగా అయితే బయటికి
విసిరేయలేం కదా!!
– పాసికంటి శంకర్, భివండీ