వరంగల్, అక్టోబర్ 12(నమస్తేతెలంగాణ) : అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల రూపురేఖలను మార్చేస్తున్నది. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మించింది. ఇదే సమయంలో ప్రతి పట్టణం, నగరంలోనూ వార్డు, డివిజన్‌కో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. వైకుంఠధామాలు నిర్మిస్తున్నది. ప్రధానంగా ప్రజలకు కూరగాయలతో పాటు మాంసం, చేపల వంటివి ఒకేచోట లభించేలా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టింది.
వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని లక్ష్మీపురం వద్ద రూ.24 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపట్టింది. గతంలో వ్యవసాయ మార్కెట్ పనిచేసిన స్థలంలో ఈ దీని నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలోని పధ్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి జీడబ్ల్యూఎంసీ ఇంజినీర్లు డిజైన్ చేశారు. వెజ్ మార్కెట్ నిర్వహణకు 105, నాన్ వెజ్ కోసం 60 గదులు, పండ్ల మార్కెట్‌కు 85 గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ వెంటనే ఇంజినీరింగ్ విభాగం టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. ప్రతిపాదిత స్థలంలో మార్కెట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఐదు నెలల క్రితం ఈ పనులు మొదలైనట్లు జీడబ్ల్యూఎంసీ ఇంజినీర్లు వెల్లడించారు. వెజ్, నాన్ వెజ్, పండ్ల మార్కెట్ నిర్వహణ కోసం ఇక్కడ వేర్వేరుగా చేపట్టిన భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని భవనాల స్లాబు పనులు జరుగగా, మరికొన్ని భవనాల నిర్మాణం రూఫ్ లెవల్, ఫిల్లర్ల స్థాయిలో ఉంది. భవిష్యత్‌లో విస్తరణకు అనుగుణంగా పధ్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒకవైపున గ్రౌండ్ ఫ్లోర్‌తో ఉండేవిధంగా ప్రభుత్వం ఈ నిర్మాణ పనులను చేపట్టింది. టెండర్ దక్కించుకున్న కాంట్రా క్టు ఏజెన్సీకి పనులు చేయడానికి ఏడాది గడువు ఇచ్చింది. మరో నాలుగు నెలల్లోగా పనులు పూర్తవుతాయని జీడబ్ల్యూఎంసీ ఇంజినీర్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కొద్దిరోజుల క్రితం మార్కెట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజినీర్లతో సమీక్షించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని, సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని చెప్పారు.