వరంగల్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేక రికార్డులను సృష్టించబోతున్నది. ప్రభుత్వరంగంలో దేశంలోనే అతి పెద్ద ఆస్పత్రిగా అవతరించబోతున్నది. రూ.1116 కోట్ల వ్యయం, 20.76 లక్షల చదరపు అడుగుల స్థలంలో నగరం నడిబొడ్డున 24 అంతస్తులు, 42 లిఫ్ట్‌లు, 2100 పడకలు, పేషంట్ అటెంటెండ్స్ కోసం 450 పడకలతో ధర్మశాల, 8 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఒకేసారి ఆరు డెడ్‌బాడీలకు పరీక్షలు చేసేందుకు వీలుగా పోస్ట్‌మార్టం గది, హాస్పిటల్ ఆవరణలో ఆరు లేన్లతో రహదారులు.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హాస్పిటల్ పనులు మొదటినుంచీ శరవేగంగా సాగుతుండగా వీలైనంత త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకురానున్నారు.
వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలను ప్రజలను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. ఈ మేరకు రూ.1,116 కోట్ల అంచనా వ్యయంతో నగరం నడిబొడ్డున తలపెట్టిన దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కార్మికులు షిప్టుల పద్ధతిన నిరంతరం పనిచేస్తున్నారు. ఇప్పటికే 16 అంతస్తుల నిర్మాణం పూర్తికాగా, 17వ ఫ్లోర్ పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం సుమారు 21 లక్షల చదరపు అడుగులకు గాను 16 లక్షల చదరపు అడుగులకు పైగా పనులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరో కొద్ది నెలల్లో మిగతా నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా పనులు చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పైనే ఉంది. తెలంగాణకు మణిహారం కాబోతున్న ఈ హాస్పిటల్ నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎన్ని ఫ్లోర్లు?, ఎన్ని లిఫ్ట్‌లు ఉంటాయి?, ప్రతి రోజూ ఎంత విద్యుత్తు వినియోగం అవుతుంది?, ఎన్ని లీటర్ల నీరు అవసరం?, ఇంకా ఏమేం ప్రత్యేకతలున్నాయనే విషయమై చర్చ జరుగుతున్నది. జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించబోతున్న తరుణంలో హాస్పిటల్ నిర్మాణ తీరుతెన్నులు, దాని ప్రత్యేకతలను ఓసారి పరిశీలిద్దాం.
లిఫ్ట్‌లు ఎన్నంటే..
ఉమ్మడి వరంగల్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి సెంట్రల్‌జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీనికి శంకుస్థాపన చేశారు. ఏడాది క్రితం ఈ పనులు ప్రారంభం కాగా రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. మొదట 1,750 పడకల సామర్థ్యంతో 16.50 లక్షల చదరపు అడుగులతో నిర్మించాలని అధికారులు డిజైన్ చేశారు. సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి మార్పులు సూచించిన ఈ హాస్పిటల్ పడకల కెపాసిటీ 2,100కు పెరిగింది. దీంతో 20.76 లక్షల చదరపు అడుగులతో దీన్ని నిర్మించేందుకు పనులు జెట్ స్పీడ్‌తో కొనసాగుతున్నాయి. ఇందులో హాస్పిటల్ బ్లాక్ ఒకటే 19.26 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. మిగతా 1.50 లక్షల చదరపు అడుగుల్లో ధర్మశాల, యుటిలిటీ బ్లాక్, కిచెన్ అండ్ డైనింగ్, క్రీచ్, సెక్యూరిటీ క్యాబిన్, లాండ్రీ, మార్చురీ, న్యూ యుటిలిటీ ఉన్నాయి. ఇక ఈ హాస్పిటల్ బ్లాక్‌లో మొత్తం 42 లిఫ్ట్‌లు ఉండబోతున్నాయి. వీటిలో 13 మంది సామర్థ్యంలో ఉన్న ప్యాసింజర్ లిఫ్ట్‌లు 8, పదిహేను మంది ప్యాసింజర్ లిఫ్ట్‌లు 2, 20 మంది పేషెంట్ బెడ్ లిఫ్ట్‌లు 20, ఇరవై తొమ్మిది మంది ప్యాసింజర్ల బెడ్ లిఫ్ట్‌లు 12 ఉంటాయని అధికారులు వెల్లడించారు.
అతిపెద్ద మార్చురీ
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో అతిపెద్ద మార్చురీ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వరంగల్- హనుమకొండ మెయిన్ రోడ్డు వైపు కాకుండా ఆటోనగర్ రోడ్డు నుంచి హాస్పిటల్లోకి ప్రవేశించేందుకు కొత్తగా నిర్మించే గేటు సమీపంలో ఏర్పాటుచేసేందుకు అధికారులు ప్లాన్ చేశారు. గేటులో నుంచి లోపలకు రాగానే ఎంట్రన్స్‌లో ఆరు లేన్ల రోడ్డు ఎడుమ వైపున ఒక పక్క ఉండేలా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి ఆరు లేదా ఏడు శవ పరీక్షలు జరపడంతో పాటు 72 మృతదేహాలను భద్రపరచడానికి సరిపడా కెపాసిటీతో ఇక్కడ మార్చురీ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో ఒకేసారి ఒక శవ పరీక్ష మాత్రమే జరిపే అవకాశం ఉంది. ఈ హాస్పిటల్లోకి ప్రవేశించడానికి మొత్తం మూడు గేట్లు ఉంటాయి. వీటిలో వరంగల్-హనుమకొండ మెయిన్ రోడ్డు వైపున కేఎంసీ వైపు ఒకటి, రెండోది ఎమర్జెన్సీ ఎగ్జిట్(ప్రస్తుతం ఉన్న గేటు) వద్ద, మూడోది ఆటోనగర్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం సమీపాన ఉండేలా అధికారులు డిజైన్ చేశారు. గేట్ల నుంచి లోపలికి ప్రవేశించే మార్గాలతో పాటు హాస్పిటల్ ఆవరణలోని అన్ని రోడ్లను కూడా మొత్తం ఆరు లేన్లుగా నిర్మించే పనులు చేపట్టారు. వరంగల్ – హనుమకొండ మెయిన్ రోడ్డును ఆనుకొని ఈ హాస్పిటల్ ముందు కేఎంసీ నుంచి సెంట్రల్‌జైల్ పెట్రోల్‌బంకు వరకు ప్రత్యేకంగా 40 అడుగులతో ఒక రోడ్డు దీని కోసమే నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
రోజుకి ఎంత విద్యుత్ కావాలంటే?
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం యుటిలిటీ బ్లాక్ నుంచే ఆపరేట్ అవుతుంది. 2,100 బెడ్స్‌తో ఉండే ఈ హాస్పిటల్ బ్లాక్‌ను ఆనుకుని ఒక పక్కన బేసిమెంట్ ఫ్లస్ జీ ఫ్లస్ వన్ యుటిలిటీ బ్లాక్, అలాగే జీ ఫ్లస్ వన్ ఫ్లస్ వన్ ధర్మశాల, జీ ఫ్లస్ వన్ ఫ్లస్ వన్ కిచెన్ అండ్ డైనింగ్, గ్రౌండ్ ఫ్లోర్‌తో క్రీచ్, సెక్యూరిటీ క్యాబిన్, లాండ్రీ, మార్చురీ, న్యూయుటిలిటీ భవనాల నిర్మాణ పనులు వేర్వేరుగా సాగుతున్నాయి. అలాగే బెడ్‌షీట్స్, పేషెంట్ల దుస్తులను ఉతకడానికి లాండ్రీ పనిచేయనున్నది. పేషెంట్ల వెంట ఉండే అటెండెంట్స్ కోసం ప్రత్యేకంగా 450 బెడ్స్‌తో ధర్మశాల నిర్మాణం జరుగుతున్నది. అలాగే హాస్పిటల్‌లోని పేషెంట్లకు అందజేసే భోజనం, అల్పాహారం తయారు చేయడానికి విశాలమైన కిచెన్ అండ్ డైనింగ్ హాల్ నిర్మిస్తున్నారు. వీటితో పాటు క్రీచ్, మార్చురీ, సెక్యూరిటీ క్యాబిన్, న్యూయుటిలిటీ నిర్వహణకు ప్రతిరోజూ ఈ హాస్పిటల్‌కు 5.08 ఎంవీఏ విద్యుత్తు వినియోగం కానున్నదని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు ప్రత్యేకంగా 33కేవీ హెచ్‌టీ పానెల్ లైన్ నిర్మించనున్నారు. విద్యుత్తు సరఫరా కోసం ఆసుపత్రి ఆవరణలో స్పెషల్‌గా మూడు ట్రాన్స్ఫార్మర్లు, మరో మూడు 415 వీఎల్టీ డీజీ సెట్స్, 9 యూపీఎస్ సిస్టమ్‌లను, 80 సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసే పనులు చేపట్టారు.
16 లక్షల లీటర్ల నీటి వినియోగం
ఓపీ విభాగానికి వచ్చే వారితో పాటు ఇన్ పేషెంట్లను చూసి వెళ్లేందుకు కూడా ప్రతిరోజూ ఈ హాస్పిటల్‌కు వేలాది మంది రానున్నారు. ఇన్‌పేషెంట్లు, వారి వెంట అటెండెంట్లు వేలాది మంది ఆసుపత్రిలో ఉంటారు. డాక్టర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ఇక్కడ విధులు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ప్రతిరోజూ 16 లక్షల లీటర్ల నీరు అవసరమని అధికారులు అంచనా వేశారు. వీటిని నిలువ చేయడంతో పాటు తాగడం, శుభ్రం చేయడం, బట్టలు పిండుకోవడం, టాయిలెట్స్ నిర్వహణకు పది లక్షల లీటర్లు పోగా, ఇతర అవసరాలకు మరో ఆరు లక్షల లీటర్ల వినియోగం ఉంటుందని తెలిపారు. 8లక్షల లీటర్ల సామర్థ్యంతో ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. 45వేల లీటర్ల కెపాసిటీతో ఆర్వో ట్రీట్మెంట్ ప్లాంట్, 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఎఫ్ల్యూఎంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 9.90 లక్షల లీటర్ల కెపాసిటీతో మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంటుతో పాటు సోలార్ ద్వారా హాట్‌వాటర్ సైప్లె, ల్యాండ్‌స్కేప్ ఇరిగేషన్, వర్షపు నీరు హార్వెస్టింగ్ పిట్స్ వంటి పనులూ జరుగుతున్నట్లు తెలిపారు.