హనుమకొండ చౌరస్తా, మార్చి 9: తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ప్రజలకు వైద్యం రానురాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. పేదలకు జబ్బుచేస్తే నయం చేసుకోవడానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. రోగం కంటే రోగ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువైంది. ఈ క్రమంలో హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్)లో టీ డయాగ్నస్టిక్ కేంద్రా న్ని ఏర్పాటు చేయనుంది. రోగ నిర్ధారణ జరగాలంటే రక్తం, మూత్రం వంటి పరీక్షలు జరపాల్సిందే.. ఈ మధ్య ప్రతి మనిషికి బీపీ, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి.
గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సర్, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన పరీక్షలు సామాన్యులకూ అవసరంగా మారాయి. ఈ మధ్య కరోనా వ్యాధి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరింది. దానికి పలు రకాల పరీక్షలు ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతున్నప్పటికీ పరీక్షల కోసం ప్రైవేట్ సెంటర్లకు పోయి వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేదలపై ఆర్థిక భారం పడుతున్నది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం టీ-డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రారంభానికి రెడీ..
పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు టీ-డయాగ్నస్టిక్ కేంద్రాన్ని హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్)లో ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకు రక్త, మూత్ర పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నది. కొత్తగా ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్, రేడియోలజీ పరీక్షలు కూడా అందుబాటులోకి రానున్నాయి. జీఎంహెచ్‌లో రూ.86లక్షలతో నూతన భవవాన్ని నిర్మించారు. నగర నడిబొడ్డున ఉన్న జీఎంహెచ్‌లో అయితే అందరికీ అందుబాటులో ఉంటుందని భావించి అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయ్యాయి. సిబ్బందిని సైతం తీసుకున్నారు. పరికరాలను పనితీరును సూపరింటెండెంట్ విజయలక్ష్మి పరిశీలించారు.
ఉచితంగా వైద్య పరీక్షలు..
ప్రస్తుతం రోగులు పరీక్షల కోసం ఎంజీఎం లేదా ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. టీ డయాగ్నస్టిక్ సెంటర్ అందుబాటులోకి వస్తే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఎక్స్‌రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, రేడియోలజీ పరీక్షలు అందనున్నాయి. సుమారు 57 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ముందుగా స్కానింగ్‌లను ప్రారంభించి, తర్వాత ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
అన్ని రకాల పరీక్షలు..
జీఎంహెచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన టీ-డయాగ్నస్టిక్ కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. సిబ్బందిని కూడా తీసుకున్నాం. త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్లో ఉచితంగా అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. పేద ప్రజలతో పాటు గర్భిణులకు సైతం ఎంతో ఉపయోగపడనుంది.
– విజయలక్ష్మి, సూపరింటెండెంట్