హనుమకొండ, అక్టోబర్ 17: ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాల్సిందేనని గురువారం హనుమకొండలోని పబ్లిక్‌గార్డెన్ నుంచి నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్(టీవీఏసీ)జాక్ పిలుపు మేరకు 16 సర్కిళ్ల (ఐదు ఉమ్మడి జిల్లాల పరిధి) నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. ఆర్టిజన్స్ వద్దు.. కన్వర్షన్ ముద్దు, ఆర్టిజన్స్ కార్మికుల ఐక్యత వర్థిల్లాలి, జేఏసీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు జేశారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 23,667 మంది కాంట్రాక్టు కార్మికులను ఆర్టిజన్లుగా కన్వర్షన్ చేసిందని, ప్రస్తుతం 19,857 మంది ఉన్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కన్వర్షన్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత ప్రకారం జేఎల్, సబ్ ఇంజినీర్లు, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్‌గా కన్వర్షన్ చేయాలన్నారు. విరమణ ఆర్టిజన్స్‌కు కేవలం రూ. 80వేలు, రూ. 84వేల వరకు మాత్రమే వస్తున్నాయని, 20 నుంచి 25 సంవత్సరాల సర్వీసు చేసిన కార్మికులకు అంత చిన్న మొత్తం బెనిఫిట్స్ రావడం బాధాకరమన్నారు.
తాజాగా ప్రభుత్వం 3,500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిందని, తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రిక్రూట్మెంట్ చేయొద్దని, ఒకవేళ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆలోచించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని, లేకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. అనంతరం సీఎండీ వరుణ్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎంఏ వజీర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, కో కన్వీనర్ నాగరాజు, అరవింద్, కో చైర్మన్ శంకర్, ఫైనాన్స్ సెక్రటరీ సదానందం, జాయింట్ సెక్రటరీ చంద్రారెడ్డి పాల్గొన్నారు.