హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28 : తెలంగాణ చరిత్ర అద్భుతమైనదని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. సామాజిక అణచివేత, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఇక్కడ జరిగాయన్నారు. గురువారం కేయూ ఆడిటోరియంలో చరిత్ర విభాగం నిర్వహణలో ‘ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు’ నిర్వహించారు. కేయూ వైస్‌చాన్సలర్ ప్రొ.రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రతినిధులు, పరిశోధకులు, చరిత్రకారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేయూ వీసీ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ వేదికగా 30 సంవత్సరాల క్రితం నిర్వహించిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను గుర్తు చేస్తూ తన హయాంలో ఈ ప్రతిష్టాత్మక కాంగ్రెస్‌ను నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సెక్యులర్, సమాఖ్య, ఫెడరల్, ప్రజాస్వామ్య విలువల రక్షణకు కృషి చేస్తుందన్నారు. సమక, సారలమ్మ, కుమ్రంభీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారత దేశ చరిత్రలోనే గొప్పవని కొనియాడారు. న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగ విశ్రాంత ప్రొఫెసర్ మృదులా ముఖర్జి మాట్లాడుతూ.. 1984లో తన పరిశోధన ‘ప్రాజెక్ట్ ఆన్ ఫ్రీడం స్ట్రగుల్’ కోసం వచ్చిన సందర్భాన్ని గుర్తుచేశారు.
82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్, న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ఆదిత్య ముఖర్జీ తన ప్రసంగం ‘జవహర్ లాల్ నెహ్రూ ఇన్ అవర్ పాస్ట్ , ప్రజెంట్ అండ్ ఫ్యూచర్’ అనే అంశంపై ప్రసంగిస్తూ చరిత్ర తుంగలో తొకబడుతోందని, నెహ్రూను చాలా కఠోరంగా చూపిస్తున్నారని, దేశ విభజన సమస్య, పాకిస్తాన్, చైనా సమస్య, వ్యవసాయ సంక్షోభం, కశ్మీర్ సమస్యతో పాటు ఇటీవలకాలంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, రాజ్యాంగ సవరణ, ప్రజాస్వామ్యానికి ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ చరిత్రకారుడు రామచందర్ గుహకు ‘లైఫ్ టైం అచీవ్మెంట్’ అవార్డు ప్రకటించారు. 81వ సెషన్లో జరిగిన సమావేశాల పుస్తకాల సంపుటిని ఆవిషరించారు. ఏడు ఉత్తమ పుస్తకాలు, పది ఉత్తమ పత్రాలకు అవార్డులు, నగదు బహుమతిని ప్రకటించారు. రిజిస్ట్రార్ పొఫెసర్ శ్రీనివాసరావు స్వాగత ఉపన్యాసం చేశారు. లోకల్ హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ ఆచార్య టీ మనోహర్ వందన సమర్పణ చేశారు. 1030కి పైగా పత్రాలు సమర్పించారు.దేశవ్యాప్తంగా 1200 మంది ప్రతినిధులు హాజరైనట్లు, ఇద్దరు విదేశీ ప్రతినిధులు, యూఎస్ఏ, ఉజ్బెకిస్తాన్ నుంచి ఒక్కొక్కరు హాజరైనట్లు వీసీ తెలిపారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ ప్రొఫెసర్ ఎస్ ఏ నదీం రేజావి పాల్గొన్నారు.