రాయపర్తి, ఫిబ్రవరి 21 : సుక్యతండాకు అధికార యం త్రాంగం కదిలివచ్చింది. సాగు, తాగునీరు లేక తండావాసులు ఆరు నెలలుగా అనుభవిస్తున్న కష్టాలపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘నీళ్ల కోసం తండ్లాట’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందిం చి ఆగమేఘాల మీద తండాబాట పట్టింది. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లలో సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశాలు రావడంతో ఎంపీవో కూచన ప్రకాశ్, ఆర్డబ్యూఎస్ ఏఈ ఎన్నకూస అనూష, గ్రిడ్ ఏఈ నిశాంక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి చల్లా అజిత్‌రెడ్డి, మిషన్ భగీరథ సూపర్వైజర్ మంగళంపల్లి వెంకటేశ్‌లతో కూడిన ప్రత్యేక బృందం కాలినడకన పర్యటించింది.
ఇంటింటికి వెళ్లి మిషన్ భగీరథ జలాలు రాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తండాలో నీళ్లు రాక నిరుపయోగంగా ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను పరిశీలించారు. ట్యాంకుకు నీటిని అందించే మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌కు పలువురు అక్రమ పద్ధతుల్లో నల్లా కనెక్షన్లు తీసుకున్నట్లు గుర్తించి వాటిని తీసి వేయించడంతో పాటు మెయిన్ పైపులైన్‌కు ఉన్న లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయించి తండావాసులకు అప్పటికప్పుడు మిషన్ భగీరథ జలాలను అందించారు.
ఈ సందర్భంగా తండాలో నీటి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ చూపిన ‘నమస్తే’ దినపత్రికకు సుక్యతండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సాగునీటి అందడం లేదని వచ్చిన కథనంపై కలెక్టర్ సత్యశారద స్పందించి ఆదేశాలివ్వడంతో ఇరిగేషన్ ఈఈ రమేశ్‌బాబు ఆధ్వర్యంలోని అధికారుల బృందం మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శించింది. నీటి లభ్యత, అవుట్ ఫ్లో గేట్ల నుంచి దిగువన కాల్వలకు నీటి విడుదల వివరాలను డీఈ కిరణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. సుక్యతండాకు వెంటనే సాగునీటిని అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఇక్కడ ఏఈలు బానోన్ బాలదాసు, నందకిశోర్, మల్సూర్‌నాయక్, ప్రశాంత్ ఉన్నారు.