హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 25: టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) టెన్షన్ పట్టుకున్నది. సుప్రీంకోర్టు తీర్పుతో వారిలో రంది మొదలైంది. 2009 తర్వాత నియామకమైన టీచర్లు కూడా టెట్ పాస్ కావాల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది. రెండేళ్లలో టెట్ క్వాలిఫై కాకపోతే రిటైర్మెంట్ తప్పదని హెచ్చరించడంతో టీచర్లలో గుబులు మొదలైంది. విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైన టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సిందేనని, ఒకవేళ 2009 తర్వాత నియమితులై ఉద్యోగ విరమణకు ఐదేళ్లలోపు సర్వీస్ ఉంటే వారికి పరీక్ష అవసరంలేదు.
కానీ, ప్రమోషన్ పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందేనన్న కోర్టు తీర్పుతో టీచర్లు షాక్‌కు గురవుతున్నారు. ప్రభుత్వాల నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో టీచర్లలో ఆందోళన మొదలైంది. రెండేళ్లలో టెట్ క్వాలిఫై కాకపోతే రిటైర్డ్ కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేయడంతో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు టెట్ పరీక్ష పెడుతుందోనని ఎదురుచూస్తున్న వారు కూడా ఉన్నారు.
టెట్ పాస్ కావాలని సర్వీస్ ఉపాధ్యాయులను భయాందోళనకు గురిచేయడం సరికాదు. టెట్ నిబంధన తప్పనిసరి చేయడం వల్ల అయోమయంలో ఉన్నాం. ఒకవేళ టెట్ నిబంధన పెడితే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ నిర్వహించి అందరూ అర్హత సాధించేలా సహకరించాలి. లేకపోతే ఉద్యమాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నవారు అవసరమైతే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడానికైనా సిద్ధం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని సర్వీస్‌లో ఉన్న టీచర్లలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాలి.
– పీ సత్యనారాయణరావు, ఎస్ఏ(ఫిజిక్స్),ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూలైవాడ, హనుమకొండ
సుప్రీంకోర్టు టెట్‌పై ఇచ్చిన తీర్పును విద్యావేత్తలతో చర్చించి పునఃసమీక్షించుకోవాలి. ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న టీచర్లు కోర్టు తీర్పుతో ఆందోళనకు గురవుతున్నారు. విద్యాహకు చట్టం రాకముందే ఉపాధ్యాయులుగా నియామకమై ఇటీవలనే ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులు టెట్ రాయడమంటే మానసికంగా ఇబ్బంది పడతారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, కేంద్రం, రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలి. ఇప్పటికే పలు ట్రైనింగ్‌లు పొందిన ఉపాధ్యాయులు, మళ్లీ టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలంటే ప్రతిరోజూ రెండు గంటలు చదవాలి. తరగతి గదిలో విద్యాబోధనకు ఆటంకం ఏర్పడుతుంది.
– ఆర్ లక్ష్మణ్సుధాకర్, సూల్ అసిస్టెంట్, హిందీ