ధర్మసాగర్, మార్చి 20 : దేవాదుల ప్రాజెక్ట్ మూడో దశ మోటర్లు ఆన్ చేసి 48 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో దేవన్నపేట పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం ఆయన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలోని దేవాదుల పంప్‌హౌస్‌ను నాయకులతో కలిసి సందర్శిం చి అధికారులతో మాట్లాడారు.
అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్‌కు నీళ్లు విడుదల చేస్తు న్న క్రమంలో గేట్‌వాల్వ్ కీని కాల్వలో పడేసి అడ్డుకున్న దుర్మార్గుడు కడియం శ్రీహరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన దేవాదుల పనులు తానే పూర్తిచేయించాననే పేరుకోసం కడియం పాకులాడుతున్నాడన్నారు.
ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే, ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిని నీళ్లు వదిలేందుకు హుటాహుటిన తీసుకొచ్చి ముఖం లేకుండా చేసుకున్న వ్యక్తి కడియం అన్నారు. గొప్పలకు పోయి ఎంత గోసపడినా, రాత్రి వరకు వేచి చూసినా మోటర్లు ఆన్ కాకపోవడంతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చిందని, దీనిని ప్రజలు, రైతులు గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేని తనంతో రైతులకు సాగు నీరందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పంటలు ఎండిపోవడానికి ప్రభుత్వమే కారణమన్నారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, ఈ విషయం అందరికీ తెలుసన్నారు. నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందనే భయంతో తానే పనులు చేస్తున్నానని చెప్పుకోవడం కోసం కడియం వచ్చి పరువు తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. ఏదేమైనా రైతులకు నీళ్లు ఇవ్వని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని రాజయ్య హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ఇన్చార్జి కర్ర సోమిరెడ్డి, నాయకలు రవీందర్, జోజి, లక్క శ్రీనివాస్, ప్రతాప్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.