ఎల్కతుర్తి, ఏప్రిల్ 16 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లులతో కలిసి ఆయన సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు అవహేళనకు గురయ్యామన్నారు. ఒక వేళ తెలంగాణ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని, నీళ్లు రాక ఎడారవుతుందని మాట్లాడారని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎలాంటి పాలనను కేసీఆర్ అందించారో మనందరికి తెలుసన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి వాటిని అమలు చేయలేడనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని, సీఎంపై వారికి నమ్మకం సన్నగిల్లిందని, తాము మోసపోయామని బాధపడుతున్నారన్నారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి పాలనలో తేడాను అర్థం చేసుకున్న ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. నాడు సమైక్య రాష్ట్రంలో, నేడు తెలంగాణలో గొప్ప సభలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్కే ఉందని, ఇప్పుడు ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవం దద్దరిల్లుతుందని వినోద్‌కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ సభకు అడ్డంకులు కలిగించాలనుకుంటే వారే అభాసుపాలవుతారని, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహించే అనుమతి ఇచ్చారన్నారు.
సాగు, తాగు నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అనుభవ రాహిత్యంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రజలందరి చూపు ఎల్కతుర్తి వైపే ఉందని, అందుబాటులో ఉన్న వాహనాల్లో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రం తెచ్చిన నేతగా, పదేండ్లు అభివృద్ధి చేసిన నాయకుడిగా కేసీఆర్ మాటలు వినేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి విజయంతం చేయాలని తక్కళ్లపల్లి పిలుపునిచ్చారు. వారివెంట వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, వెంకన్న, మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్ తదితరులున్నారు.