వరంగల్ చౌరస్తా : కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని పలు హాస్పిటల్స్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ సర్వే సంగీత తనిఖీలు చేశారు. జాతీయ వైద్య మండలి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా నేడు ఆమె కేఎంసీ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంజీఎం, సీకేఎం ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ లను తనిఖీ చేశారు. ఉదయం కేఎంసీలో విభాగాధిపతులు వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కళాశాలలో వైద్య విద్యార్థుల సంఖ్య విభాగాల వారీగా సేకరించడంతోపాటుగా కేఎంసీ పరిధిలోని హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, ల్యాబ్ లు, నిత్యం సేవలు పొందుతున్న ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మౌలిక వసతులను పరిశీలించి, విభాగాల వారీగా వైద్య సేవల తీరును రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఎంజీఎం లో ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఫార్మసీలో అందిస్తున్న మందులు, పోర్టల్ నమోదు పై వివరాలు అడిగి తెలుసుకొని సంతృప్తికర సమాధానం ఇవ్వని సూపర్ వైజర్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్య శారదను ఆదేశించారు. డైట్ నిర్వహణను పరిశీలించిన కమిషనర్ డైట్ లో సైతం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అనంతరం పీడియాట్రిక్స్ వార్డును పరిశీలించి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
తదనంతరం సీకేఎం హాస్పిటల్ సందర్శించిన కమిషనర్ లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించి, నిత్యం వైద్య సేవలు పొందుతున్న మహిళల వివరాలను, రికార్డు నమోదు, అందుబాటులోవున్న పరికరాలు, డైట్ నిర్వహణ , వైద్య విద్యార్ధులకు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లను, మందుల పంపిణీ, 102 వాహనాల నిర్వహణ, పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాంబశివరావు, పలువురు విభాగాధిపతులు, వైద్యులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.