భీమదేవరపల్లి, ఏప్రిల్ 07: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకుందుకే ప్రభుత్వం సిటీ పోలీస్ యాక్టును నెలరోజుల పాటు అమలు చేసిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మండల సురేందర్ ఆరోపించారు. మండలంలోని ముల్కనూరులో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక, అడిగిన వాళ్ల మీద తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొక్కి పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ప్రతిపక్ష నాయకులపై, బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతూ పోలీసు వ్యవస్థను తన సొంత ఎజెండాకు వాడుకుంటున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులని, కేసులకు భయపడరని తెలిపారు. రజతోత్సవ సభ జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి చేసే కుటిల ఎత్తులను తిప్పి కొడతామని హెచ్చరించారు. సిటీ పోలీస్ యాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.