ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జీపీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలతో అధికారులు ఉపాధి పని ప్రదేశాల్లో సకల వసతులు కల్పిస్తున్నారు. కూలీలకు వడదెబ్బ తగలకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో చలివేంద్రాల ఏర్పాటుతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా వడగాలుల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. నర్సరీల్లోని మొక్కలను సంరక్షించాలని, ప్రతి రోజూ రెండు పూటలా నీరందించాలని వన సేవకులకు ఆదేశాలు జారీ చేశారు.
– హనుమకొండ, ఏప్రిల్ 27
హనుమకొండ, ఏప్రిల్ 27 : వేసవి నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో ప్రణాళికలు రూపొందించారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగడం, వడ గాలులు వీస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందుస్తు జాగ్రత్తగా ఆయా గ్రామ పంచాయతీల్లో చర్యలు తీసుకోవా లని అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎండ తీవ్రత, వడగాలులపై గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో పాటు చాటింపు చేయించాలని, ఉపాధి పనులు చేస్తున్న ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పించాలని, అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలని, అలాగే హరితహారం కింద నాటిన మొక్కలను రక్షించేందుకు ప్రతిరోజూ నీళ్లు పోయాలని, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ప్రజలు బయటకు రాకుండా ఉండేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని చలి వేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచ్లకు సర్క్యులర్ జారీ చేశారు.
ప్రజలకు అవగాహన
అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి సాయం త్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని, ఒక వేళ బయటకు తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వీటిపై గ్రామాల్లో చాటింపు చేయడంతో పాటు షోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయనున్నట్లు పీఆర్ అధికారులు తెలిపారు. అదేవిధంగా వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో తప్పకుండా చలి వేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ అధికారులు మిషన్ భగీరథ అధికారులను సమన్వయం చేసుకొని ఎలాంటి తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, పశువులకు నీటి తిప్పలు రాకుండా ఉండేలా నీటి తొట్టెలు ఏర్పాటు చేయనున్నారు.
ఉపాధి పని ప్రదేశాల్లో టెంట్లు, నీళ్లు
ఉపాధి కూలీలు పని చేసే ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా కూలీలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పని చేసే విధంగా కూలీలను మోటివేట్ చేస్తున్నారు. పని చేసే ప్రదేశంలో టెంట్, నీటి వసతి కల్పిస్తున్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీ, పీహెచ్సీలు, సీఎస్సీ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఉపాధి హామీ పని ప్రదేశాల వద్ద, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి కూలీలతోపాటు గ్రామ ప్రజలకు ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే సమీపంలోని వైద్య కేంద్రం నుంచి సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని సంబందిత శాఖల అధికారులకు అందజేస్తారు.
హరితహారం మొక్కల రక్షణ
రోజు రోజుకు పెరుగుతున్న వేడితో హరితహారం మొక్కలు, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. నాటిన మొక్కలు, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు నీళ్లు పోయడంతో పాటు చలువను ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ప్రతి రోజు మొక్కలకు తప్పకుండా నీరు అందించాలని, చనిపోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సర్క్యులర్ జారీ చేశాం
వేసవి సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చర్యల విషయంలో ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశాం. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలకు, ఉపాధి కూలీలకు ఇబ్బందులు రాకుండా మౌలిక వసతుల కల్పించడంతో పాటు ఎండ, వడగాలులు విషయంలో ప్రజలకు అవగాహ సదస్సులు నిర్వహించడంతోపాటు గ్రామాల్లో చాటింపు చేయిస్తున్నాం. ప్రజలు కూడా ఎండ సమయంలో బయటకు రాకపోవడం మంచిది. హరితహారం మొక్కల రక్షణకు సైతం చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజు మొక్కలకు నీటిని అందించాలని ఆదేశించాం.
-వీ జగదీశ్వర్, హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి