భీమదేవరపల్లి, ఏప్రిల్ 9: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ముల్కనూరు వెంకట సాయి గార్డెన్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు మండల సురేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కేసీఆర్ రాజకీయ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాకారమై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం మనందరికీ సంతోషదాయకమన్నారు.
ఎన్నో అవమానాలు, అవహేళనలు, అన్నిటిని అధిగమించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన ఘనత గులాబీ జెండా అయిన బీఆర్ఎస్ పార్టీ కే దక్కుతుందన్నారు. ఈనెల 27వ తేదీన మన ఇంటి పార్టీ పండుగకు గ్రామ గ్రామాన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జక్కుల అనిత, వంగ రవి, సంగ సంపత్, షరీఫోద్దీన్, మారుపాటి మహేందర్ రెడ్డి, సల్పాల తిరుపతి, శనిగరపు సదానందం, అప్పని భిక్షపతి, మర్రి మల్లేష్, గుడికందుల పూర్ణచందర్, రాజు, కండె సుధాకర్, ఎర్రోజు వినయ్, తాళ్లపల్లి కుమార్, రచ్చ సంపత్ తదితరులు పాల్గొన్నారు.